25-12-2023 RJ
జాతీయం
న్యూఢిల్లీ, (డిసెంబర్ 25): దేశరాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. రాజధాని ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 9.4 డిగ్రీల సెల్సియస్కు పడిపోయాయి. దీంతో రాజధాని ప్రాంతాన్ని దట్టంగా పొగ కమ్మేసింది. దట్టమైన పొగ మంచు కారణంగా విజిబిలిటీ సరిగా లేక వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారత వాతావరణ విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో విజిబిలిటీ 125 మీటర్లకు పడిపోయింది. ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లోని వివిధ ఎయిర్ పోర్టుల్లో కూడా విజిబిలిటీ 0 మీటర్లకు పడిపోయింది.
ఢిల్లీలోని పాలెం విమానాశ్రయం, అమృత్సర్, ఆగ్రా, గ్వాలియర్, ప్రయాగ్జ్, జైసల్మేర్ విమానాశ్రయాల్లో విజిబిలిటీ 0 మీటర్లకు పడిపోయింది. ఢిల్లీ సఫారంజ్లో 200 మీటర్లు, షిల్లాంగ్ విమానాశ్రయంలో 300 మీటర్లకు విజిబిలిటీ పడిపోయింది. దీంతో జాతీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దట్టమైన పొగ మంచు కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక మరికొన్ని విమానాలను దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం 6 గంటలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీ చేరాల్సిన ఆరు విమానాలను సైతం దారి మళ్లించినట్లు వెల్లడించారు.
బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వెళ్లాల్సిన విమానం, ముంబై నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన విమానం ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తిరిగి బెంగళూరుకు దారి మళ్లించారు. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్ర స్థాయికి పడిపోయింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డేటా ప్రకారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దాదాపు 400కి చేరుకుంది. కాగా, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 0-100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి, కాలుష్యం లేదని ,100-200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్తంగా ఉందని అర్థం. ఇక 200-300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని, 300-400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా ఉందని, 400-500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని అర్థం చేసుకోవచ్చు. కాగా, ఈ మధ్య ఢిల్లీలో వాయు కాలుష్యం ఆందోళనకరంగా మారుతున్నది.