25-12-2023 RJ
జాతీయం
తిరువనంతపురం, (డిసెంబర్25): శబరిమలైకు మండల పూజల సందర్భంగా అయ్యప్పలు భారీగా తరలి రావడంతో శబరిగిరులు కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎరుమేలికి వచ్చే వాహనాలను ఎంఈఎస్ కాలేజీ వద్ద పోలీస్లు నిలిపివేస్తున్నారు. సుమారు నాలుగు గంటల పాటు పోలీస్లు వాహనాలను నిలిపివేశారు. దీంతో అఅక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ వాహనాలను అనుమతించాలని ఎపీ, తెలంగాణ, తమిళనాడుకు చెందిన పలువురు అయ్యప్పస్వాములు రోడ్డుపై ఆందోళనకు దిగారు. పోలీస్ తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు.
భక్తుల రద్దీకి అనుగుణంగా పోలీస్ లు, కేరళ ప్రభుత్వం ఏర్పాట్లు చేయలేదని అయ్యప్పలు ఆరోపిస్తున్నారు. దీంతో పంబ నుంచి సన్నిధానం వరకు భారీగా క్యూలైన్లు నిలిచిపోయాయి. ఈనెల 27తో మండల పూజలు ముగియనున్నాయి. వరుస సెలవులు కావడంతోకూడా భక్తులు భారీగా శబరిమలైకు వస్తున్నారు. అనూహ్య రద్దీ కారణంగా వర్చువల్ క్యూ బుకింగ్లను తగ్గించడానికి ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు చర్యలను చేపట్టింది. శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. తెలంగాణ, ఆంధప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.
శబరిమలలో భక్తుల రద్దీ పెరగడంతో నాలుగు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పలువురు భక్తులు వాహనాలను వదిలేసి ఎరుమేలి నుంచి శబరిమలకు పాదయాత్రగా వెళ్తున్నారు. భక్తులు భారీ సంఖ్యలో రావడంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసింది. కొందరు భక్తుల స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి 24 గంటల నుంచి 36 గంటల సమయం పడుతుండడంతో వెనుదిరుగుతున్నారు.
స్వామి మాలధారణలో ఉన్న చిన్నారులు సైతం నానా ఇబ్బందులు పడుతున్నారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తుండడంతో అటవీ మార్గంలో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు అటవీ శాఖ అధికారులు అనుమతి ఇస్తున్నారు. ఎరుమేలి నుంచి పంపా వరకు అటవీ గుండా ప్రయాణం చేయాల్సి ఉంటుంది.