26-12-2023 RJ
జాతీయం
న్యూఢిల్లీ, (డిసెంబర్ 26): తెలంగాణకు రావాల్సిన ప్రయోజనాలు, మంజూరు కావాల్సిన నిధుల గురించి ప్రధాని మోదీకి వివరించినట్లుగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వివరించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను గత ప్రభుత్వం తీసుకురాలేకపోయిందని భట్టి చెప్పారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంగళవారం ప్రధాని మోదీని కలిశారు. అరగంట సేపు వీరి భేటీ సాగింది. ఈ భేటీ తర్వాత సాయంత్రం ఢిల్లీలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధానితో జరిగిన సమావేశ వివరాలను భట్టి విక్రమార్క మీడియాకు వివరించారు. అలాగే హైదరాబాద్ కు ఐటీఐఆర్, వెనుబడిన ప్రాంతాలకు ప్రత్యేక నిధులు, స్టీల్ ప్లాంట్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎం, సైనిక్ స్కూల్ వంటివాటిని మంజూరు చేయాలని ప్రధానిని కోరినట్లుగా భట్టి విక్రమార్క వివరించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన వివరాలను ప్రధానికి వివరించినట్లు చెప్పారు.
తెలంగాణ ప్రయోజనాలను కాపాడడం కోసం తొలిసారి ప్రధాని మోదీని కలిశామని, తమ వినతులపై ప్రధాని సానుకూలంగా స్పందించారని భట్టి విక్రమార్క వివరించారు. బీఆర్ఎస్ చేసిన అప్పుల నుంచి బయట పడడం కోసం పెండింగ్ లో ఉన్న నిధులను ఇవ్వాలని కోరినట్లు వెల్లడించారు. నీళ్లు- నిధులు నియామకాల విషయంలో గత రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేసిందని అన్నారు. పదేళ్లు పాలన చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థల్ని నాశనం చేసిందని ఆరోపించారు. ఆ లోటు నుంచి భర్తీ అవడం కోసం వెంటనే కేంద్రం నుంచి గ్రాంట్లను విడుదల చేయాలని ప్రధానిని కోరినట్లు భట్టి చెప్పారు.
విభజన చట్టం ప్రకారం తెలంగాణ హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానిని కలిశామని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం.. కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై చర్చించామని తెలిపారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేయాలని కోరామన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. విభజన చట్టం ప్రకారం ఒక మేజర్ ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానిని అడిగామని చెప్పారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుకు మంజూరు చేయాలని కోరామన్నారు. తెలంగాణకు ఐఐఎం సైనిక్ స్కూల్ మంజూరు చేయాలని అడిగామని చెప్పారు. బిఆర్ఎస్ నేతల ఆర్థిక అరాచకత్వంతో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయిందన్నారు. అప్పుల్లో కూరుకున్న తెలంగాణకు.. ఆర్థిక సాయం చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేవామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.