27-12-2023 RJ
జాతీయం
బెంగళూరు, (డిసెంబర్ 27): తమిళనాడులోనే కాదు... అప్పుడప్పుడు కర్ణాటకలోనూ భాషాభిమానం అగ్గి రాజేస్తూ ఉంటుంది. హిందీ, ఇంగ్లీష్ భాషలపై అసహనం ఇక్కడా కనిపిస్తూనే ఉంటుంది. కన్నడ అంటే వాళ్లకు అంత ప్రేమ. ఈ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన భాష మాదే అని చెప్పుకుంటారు కన్నడియులు. ఇక అక్కడి రచయితలైతే 'మా భాషా రచనలకు 8 జ్ఞానపీఠ్ అవార్డులు వచ్చాయి అని గర్వంగా చెబుతారు. ఈ భాషాభిమానం వాళ్ల సంస్కృతిలో భాగమే. కానీ అప్పుడప్పుడూ ఇది కాస్త హద్దులు దాటుతూ ఉంటుంది. ఇప్పుడదే జరుగుతోంది. ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయమే అందుకు కారణం. ఈ ఏడాది అక్టోబర్లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు కన్నడవాదం అనే తేనెతుట్టను మరోసారి కదిపాయి.
రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కన్నడ భాషను నేర్చుకోవాలని, అందరూ కన్నడిగులే అవ్వాలని తేల్చి చెప్పారు. అంతకు ముందే కీలక ఉత్తర్వులు జారీ చేశారు. బెంగళూరు సిటీలో బిజినెస్ చేస్తున్న వాళ్లంతా నేమ్ బోర్డులపై కచ్చితంగా కన్నడ భాషలో రాయాలని, అందుకు కొంత ఖాళీ ఉంచాలని తేల్చి చెప్పింది ప్రభుత్వం. బెంగళూరు మున్సిపాలిటీ అధికారులు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఆర్డర్ పాస్ చేసింది. బిజినెస్లకు సంబంధించిన నేమ్ బోర్డులలో 60శాతం మేర కన్నడనే కనిపించాలనేది ఈ ఉత్తర్వులలో సారాంశం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా సిటీ అంతటా ఇది అమలవ్వాలని రూల్ పెట్టారు. కన్నడవాదులంతా ఈ నిబంధన పెట్టినందుకు ప్రభుత్వాన్ని పొగిడారు.
కానీ... రూల్ పెట్టినంత వరకూ బాగానే ఉంది. అమలు చేయడంలోనే చాలా ఆలస్యం జరుగుతోంది. ఇప్పటికీ చాలా బోర్డులపై ఇంగ్లీష్ కనిపిస్తోంది. ఇది చూసి అసహనానికి గురైన కన్నడ సంఘాలు క్రమంగా ఆందోళనలు ఉదృతం చేశాయి. ఇచ్చిన ఉత్తర్వుల మాటేంటి' అంటూ నిలదీస్తున్నాయి. ముఖ్యంగా ప్రత్యేకంగా ఓ ప్రచారాన్నే మొదలు పెట్టింది. భారీ వాహనాల్లో బెంగళూరు రోడ్లపై తిరుగుతూ కన్నడకు అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు. కన్నడ నేలపై ఉంటూ.. ఇక్కడే ఉపాధి పొందుతున్నప్పుడు కన్నడ భాషను గౌరవించడానికి వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నిస్తున్నారు.
నేమ్ బోర్డులను కన్నడ భాషలోనే పెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారమే కాస్త అదుపు తప్పి ఆందోళనలకు కారణమైంది. బెంగళూరులోని అన్ని షాప్ల వద్దకు వెళ్తున్న కన్నడ రక్షణ వేదికే సంఘ సభ్యులు ఇంగ్లీష్ పేర్లున్న బోర్డులను ధ్వంసం చేస్తున్నారు. వాటి స్థానంలో కన్నడ బోర్డులను పెట్టుకోవాలని ఓనర్స్ కి వార్నింగ్ ఇస్తున్నారు. వాళ్లను అడ్డుకోడానికి పెద్ద ఎత్తున పోలీసులు మొహరించారు. అసలు ఇది ఇంత పెద్ద వివాదం అవుతుందని ఎవరూ ఊహించకపోవచ్చు ఉన్నట్టుండి కన్నడ మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి ఇలా నిరసనలు వ్యక్తం చేయడం వెనక వేరే ఇంకేమైనా ఉద్దేశాలున్నాయా అన్న అనుమానాలకు తావిస్తున్నాయి.
కెంపెగౌడ ఎయిర్ పోర్ట్ వద్ద పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు కన్నడ మద్దతుదారులు. బోర్డులపై కన్నడ కనిపించకపోతే లీగల్గా చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని మున్సిపల్ అధికారులు ఇప్పటికే తేల్చి చెప్పారు. లైసెన్స్ లు రద్దు చేసేందుకైనా వెనకాడమని స్పష్టం చేశారు. అయినా బోర్డులు ఎందుకు మార్చడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు కన్నడ వాదులు. 2017లో ఇదే కన్నడ రక్షణ వేదికే గ్రూప్ బెంగళూరులోని మెట్రో స్టేషన్లలో హిందీ కనిపించిన చోట నలుపు రంగు పూసి నిరసన వ్యక్తం చేశారు. కన్నడ, ఇంగ్లీష్ తప్ప మరే భాష స్టేషన్లలో కనిపించకూడదంటూ ఆందోళన చేశారు. ఈ నిరసనలకు ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా మద్దతునిచ్చారు. ఇకపై కొత్తగా నిర్మించే మెట్రో స్టేషన్లలో హిందీ భాషకనిపించదని హామీ ఇచ్చారు. గతంలోనూ సిద్దరామయ్య కన్నడ వాదాన్ని గట్టిగానే వినిపించారు. ఇప్పుడు దీనికి మద్దతుగా కర్ణాటక రక్షణ వేదిక రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు చేపట్టింది. ఇందులో భాగంగా బెంగళూరులో నిర్వహించిన ర్యాలీలు ఉద్రిక్తతకు దారితీశాయి.
వివిధ వాణిజ్య సంస్థలు కన్నడ భాషలో బోర్డులను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలంటూ కర్ణాటక రక్షణ వేదిక చేసిన విజ్ఞప్తి నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కన్నడ భాషకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. వాణిజ్య సంస్థలు, దుకాణాల నామఫలకాల్లో 60శాతం కన్నడ అక్షరాలే ఉండాలని ఆదేశించింది. అయితే ఈ నిబంధన ఫిబ్రవరి చివర నుంచి అమల్లోకి రానున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. వ్యాపారులంతా వీటిని తప్పనిసరి గా అమలు చేయాలన్నారు. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు పలు ప్రాంతాల్లో రెచ్చిపోయిన ఆందోళనకారులు.. హోటళ్లు, దుకాణాలపై ఆంగ్లంలో ఉన్న నామఫలకాలను తొలగించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
కన్నడలో నామఫలకాలకు సంబంధించి బెంగళూరు నగరపాలక సంస్థ ఇచ్చిన ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని డిమాండు చేస్తూ కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు బెంగళూరులో ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో నగరంలోని పలు దుకాణాల నామఫలకాలు తొలగించేందుకు యత్నించారు. హోటళ్లు, పలు దుకాణాల బయట ఆంగ్లంలో ఉన్న బోర్డులను ధ్వంసం చేశారు. మరికొన్ని షాపుల పేర్లపై నల్లరంగు చల్లారు. ఆందోళనకారులు చర్యలను అడ్డుకున్న పోలీసులు.. వారిని కస్టడీలోకి తీసుకున్నారు. ఈ వివాదంపై బృహత్ బెంగళూరు మహానగర సంస్థ చీఫ్ కమిషనర్ తుషార్ గిరినాథ్ స్పందించారు. ఈ ఆదేశాలు ఫిబ్రవరి 28 నుంచి అమల్లోకి వస్తాయని, వాటిని పాటించకుంటే సంస్థలపై చర్యలు ఉంటాయన్నారు.