28-12-2023 RJ
జాతీయం
అయోధ్య, (డిసెంబర్ 28): ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం అయోధ్యలో నిర్మిస్తున్న శ్రీ రామ మందిర గర్భగుడి నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. భవ్య రామమందిరం తుది మెరుగులు దిద్దుకుంటోంది. జనవరి 22న ఐదేళ్ల బాలుడి రూపంలో శ్రీరాముడు ఆలయంలో కొలువుదీరనున్నాడు. రాముడి విగ్రహానికి ఎన్ని విశిష్టతలున్నాయో.. అక్కడ ఏర్పాటు చేయబోయే గంటకూ అన్నే విశేషాలున్నాయి.
దీనిని తమిళనాడులో ప్రత్యేకంగా తయారు చేయించారు. అష్టధాతువుతో తయారు చేసిన ఈ గంట రామ మందిరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 600 కిలోలకు పైగా బరువున్న దీనిని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ 2020 నుంచే తయారు చేయడం ప్రారంభించారు. రామమందిర ప్రారంభోత్సవం దగ్గర పడుతుండడంతో తమిళనాడు నుంచి అయోధ్యకు తరలించారు.
గంటపై జై శ్రీరామ్ అని రాసి ఉంది. దీనిని ప్రస్తుతం ఆయోధ్య రామమందిర ప్రాంగణంలో భక్తుల సందర్శనార్ధం ఉంచారు. ఇక జనవరిలో జరగనున్న రామమందిర ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ప్రస్తుతం రామ్లల్ లా విగ్రహాలు తుదిమెరుగులు దిద్దుకుంటున్నాయి. కాశీ పండితులు అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.