30-12-2023 RJ
జాతీయం
చెన్నై, (డిసెంబర్ 30): తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి ఓ ట్రక్కు టీ షాపులోకి దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున పుదుక్కోట్టై జిల్లాలో తిరుచ్చి - రామేశ్వరం జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుచ్చి - రామేశ్వరం హైవేపై వేగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్కు.. అదుపుతప్పి రోడ్డు ప్రక్కనున్న టీ షాపులోకి దూసుకెళ్లింది.
టీషాపు ముందు పార్క్ చేసి ఉన్న వాహనాలను ఢీకొట్టుకుంటూ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందగా.. మరో 19మంది గాయపడ్డారు. మరణించిన వారిలో ఒక మహిళ కూడా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స కోసం ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.