30-12-2023 RJ
జాతీయం
న్యూఢిల్లీ, (డిసెంబర్ 30): శ్రీరామ జన్మభూమి అయోధ్యలో ఏర్పాటైన అత్యాధునిక విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన కొద్ది సేపటికే ఢిల్లీ నుంచి ఇండిగో విమానం వాల్మీకి విమానాశ్రయం చేరుకుంది. ఈ విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అని పేరు పెట్టారు. రూ.1450 కోట్లకు పైగా వ్యయంతో కేవలం 20 నెలల వ్యవధిలో ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశారు. ఇది సంవత్సరానికి సుమారు 10 లక్షల మంది ప్రయాణీకులకు సేవలు అందిస్తుంది.
విమానాశ్రయం ప్రారంభమైన కొద్ది సేపటికే ఢిల్లీ నుంచి తొలి విమానం బయల్దేరింది. రామ భక్తులతో ఇండిగో విమానం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అయోధ్యలోని మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు పయనమైంది. ఈ విమాన ప్రయాణానికి ముందు పైలెట్ అషుతోష్ శేఖర్ స్పెషల్గా ప్రయాణికులను ఆహ్వానించారు. ఈ ప్రత్యేక విమానానికి కెప్టెన్గా వ్యవహరించే అవకాశం తనకు కల్పించిన ఇండోగో సంస్థకు ధన్యవాదాలు తెలిపారు..
ఇది నాకు, ఇండోగోకు చాలా సంతోషకర సందర్భం. మా విమానంలో మీ ప్రయాణం చాలా సౌకర్యవంతంగా, భద్రంగా ఉంటుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. అలాగే తన కో-పైలెట్ ను, క్యాబిన్ ఇన్ఛార్జ్ ను కూడా అషుతోష్ పరిచయం చేశారు. అనంతరం జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. అతడితో ప్యాసింజర్లు కూడా జత కలిశారు. కాగా, అంతకు ముందు విమానాశ్రయంలో ఇండిగో సిబ్బంది, ప్రయాణికులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.