01-01-2024 RJ
జాతీయం
ముంబై, (జనవరి 1): కొత్త నెలతో పాటు కొత్త సంవత్సరం కూడా ప్రారంభమైంది. మన దేశంలో మాసం మారిన ప్రతిసారీ కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఆ మార్పులు ప్రజల డబ్బుపై ప్రభావం చూపుతాయి. ఇప్పుడు, కొత్త సంవత్సరం కూడా ప్రారంభమైంది కాబట్టి, డబ్బుకు సంబంధించి మరికొన్ని ఎక్కువ రూల్స్ మారాయి. కొత్త సంవత్సరంలో కొత్త కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వారికి నిరాశ కలింగించేలా పరిస్థితి ఉంది. అన్ని మోడల్, అన్ని కంపెనీలు ధరలను పెంచేస్తున్నాయి.
మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్ర, మెర్సిడెస్-బెంజ్, ఆడి సహా చాలా కార్ కంపెనీలు రేట్లు పెంచుతు న్నాయి. 2024 తొలి రోజు నుంచి వివిధ మోడళ్ల ధరలు పెంచుతామని ఈ కంపెనీలు గతంలోనే ప్రకటించాయి. ముడి వస్తువుల ధరలు పెరగడంతో కార్ల ధరలు పెంచాల్సి వస్తోందని ఈ ఆటో కంపెనీలు చెబుతున్నాయి. ప్రస్తుతం, మన దేశంలో ఎక్కువ నగదు లావాదేవీలు యూవీఐ ద్వారానే జరుగుతున్నాయి. డిజిటల్ బ్యాంకింగ్ పెరగడంతో మోసాల ప్రమాదాలు కూడా పెరిగాయి. దీనిని అడ్డుకోవడానికి ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
గత ఏడాది కాలంగా ఉపయోగించని యూపిఐలను రద్దు చేస్తోంది. చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం ఇటీవలే సమీక్షించింది. సుకన్య సమృద్ధి యోజన (-నాజ), 3-సంవత్సరాల టర్మ్ డిపాజిట్ పథకంపై వడ్డీ రేట్లను పెంచింది. కొత్త వడ్డీ రేట్లు 2024 జనవరి 01 - మార్చి 31 కాలానికి వర్తిస్తాయి. అంటే, పెరిగిన వడ్డీ రేట్ల ప్రయోజనం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు ఇప్పుడు 8.20 శాతానికి, మూడేళ్ల కాల వ్యవధి డిపాజిట్లపై వడ్డీ రేటు 7.10 శాతానికి పెరిగింది. కొత్త మొబైల్ కనెక్షన్ తీసుకునే కస్టమర్లకు ఈ సంవత్సరంలో కొంత వెసులుబాటు లభిస్తుంది.
రూల్స్ లో ఇటీవలి మార్పుల తర్వాత, కొత్త సిమ్ కార్డ్ కోసం ఇకపై జిరాక్స్ కాపీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ధృవీకరణ పూర్తిగా డిజిటల్లోకి మారుతుంది. దీనివల్ల, ఒకరి పేరిట మరొకరు సిమ్ తీసుకుని దుర్వినియోగం చేసే కేసులకు అడ్డుకట్ట పడుతుంది. 2024 జనవరి 1 నుంచి రివైజ్డ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్స్ జారీ చేయాలని అన్ని బీమా కంపెనీలను బీమా నియంత్రణ సంస్థ ఇర్దాయ్ ఆదేశించింది. కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ లో ఒక ఇన్సూరెన్స్ కు సంబంధించిన మొత్తం సమాచారం ఉంటుంది. పాలసీలోని అన్ని నిబంధనలు, షరతులను సామాన్య ప్రజలు అర్థం చేసుకోగలిగేలా సాధారణ భాషలో రాసి, అనాలో అందించాలని బీమా కంపెనీలకు సూచించింది.