01-01-2024 RJ
జాతీయం
చండీగఢ్, (జనవరి 1): అర్జున అవార్డు గ్రహీత, పంజాబ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డీఎస్పీ దల్బీర్ సింగ్ దేఓల్ (54) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. జలంధర్ నగర శివారులోని ఓ కాలువ పక్కన ఆయన మృతదేహాన్ని సోమవారం పోలీసులు గుర్తించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జలంధర్లోని పంజాబ్ సాయుధ పోలీసు ప్రధాన కార్యాలయంలో దల్బీర్ సింగ్ను ప్రభుత్వం నియమించింది. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా స్నేహితులతో కలిసి ఆయన ఆదివారం సాయంత్రం బయటకు వెళ్లారు.
ఇంటి నుంచి వెళ్లి ఎన్ని గంటలైనా తిరిగి రాలేదు. దీంతో ఆయన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారిని గుర్తించేందుకు పోలీసులు గాలింపులు చేపట్టారు. నగర శివారులో ఓ కాలువ పక్కన శరీరమంతా గాయాలతో ఓ వ్యక్తి మృతదేహం కనిపించిందని పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆ మృతదేహం దల్బీర్ సింగ్ నని గుర్తించారు.
అయితే, ఆయన మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా.. గతంలో జరిగిన ఆసియా క్రీడల్లో పాల్గొన్న దల్బీర్ వెయిట్ లిఫ్టింగ్ లో బంగారు పతకాన్ని గెలిచారు. అందుకు గానూ 2000లో ఆయనను అర్జున అవార్డు వరించింది.