05-01-2024 RJ
జాతీయం
చండీగఢ్, (జనవరి 5): అక్రమ మైనింగ్ కేసులో హరియాణా నేత దిల్ బాగ్ సింగ్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జరిపిన సోదాల్లో కోట్ల రూపాయల నగదు బయటపడింది. విదేశాల్లో తయారైన తుపాకులు, 100 మద్యం బాటిళ్లు, కేజీల కొద్ది బంగారం, వెండిని అధికారులు గుర్తించారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దిల్బాగ్ సింగ్, ఆయన అనుచరులకు చెందిన ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. గురువారం ఉదయం మొదలైన ఈ తనిఖీలు శుక్రవారం కూడా కొనసాగాయి. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ నేత దిల్ బాగ్ సింగ్ తో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేందర్ పన్వార్ పై కూడా ఈడీ దృష్టి సారించింది.
మనీలాండరింగ్ చట్టం కింద సోనిపత్, మొహాలీ, ఫరీదాబాద్, చండీగఢ్, కర్నాల్, యమునా నగర్ లోని 20 ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. యమునానగర్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో మైనింగ్ పై జాతీయ హరిత ట్రైబ్యునల్ నిషేధం విధించిన తర్వాత కూడా ఆ తరహా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు వీరిపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పలు కేసులు నమోదు కాగా.. ఈడీ మనీలాండరింగ్ కింద దర్యాప్తు ప్రారంభించింది. అక్రమ మైనింగ్ కు సంబంధించిన దస్త్రాలను ఈడీ పరిశీలిస్తోంది. ఈ దాడుల్లో అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు వార్తలు వచ్చినప్పటికీ.. వాటిపై ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేదు. సింగ్.. యమునానగర్ మాజీ ఎమ్మెల్యే కాగా.. పన్వార్ సోనిపత్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.