05-01-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, (జనవరి 5): ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ ను ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎన్నికలకు నామినేట్ చేసింది. శుక్రవారం జనవరి 19న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆమె తన పదవికి రాజీనామా చేసింది. ఈ క్రమంలో తన కార్యాలయం లో రాజీనామా లేఖపై సంతకం చేసి ఆమె వెళుతున్న క్రమంలో అక్కడి సిబ్బంది ఉద్వేగానికి లోనయ్యారు. ఆమెను పలువురు మహిళలు హత్తుకుని కన్నీరు పెట్టుకున్నారు. అంతేకాదు ఇంకొంత మంది స్వాతి వెళుతున్న క్రమంలో చప్పట్లు కొడుతూ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా జరుగుతాయని చెప్పవచ్చు. అయితే స్వాతి మలివాల్ చిన్న వయస్సులోనే ఢిల్లీ మహిళా కమిషన్ ఛీఫ్ గా పదవి భాధ్యతలు స్వీకరించి ఎన్నో సవాళ్లను స్వీకరించింది. దీంతోపాటు అనేక సార్లు ఆమె మహిళల హక్కులు, సామాజిక సమస్యల పట్ల చురుకుగా వ్యవహిరించింది. ఇంకొన్ని సార్లు మహిళలపై హింసను ఎదుర్కోవడం సహా కఠినమైన చట్టాలు, లింగ సమానత్వం వంటి అంశాల గురించి స్వాతి ధైర్యంగా ప్రశ్నించింది.
ఈ నేపథ్యంలో ఆమెకు అనేక మంది మహిళలతోపాటు యువకులు కూడా స్వాతి చేస్తున్న అనేక కార్యక్రమాలకు మద్దతు ఇచ్చారు. దీంతో ఆమె పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకున్నారు. ఇలాంటి క్రమంలో స్వాతి ఇకపై పార్లమెంటులో తన గొంతును వినిపించనుంది. స్వాతి మొదటిసారి నామినేట్ అవుతుండగా.. సంజయ్ సింగ్, గుప్తాలను రెండోసారి రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు తెలిపాయి.