05-01-2024 RJ
జాతీయం
అయోధ్య, (జనవరి 5): ఈనెల 22వ తేదీన అయోధ్యలోని రామమందిరంలో రామ్ లల్ లా ప్రతిష్టాపన కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనున్న సందర్భంగా .. ట్రస్ట ఓ ఉదాత్త నిర్ణయం తీసుకుంది. బాబ్రీకి మద్దతుగా వాదించిన ముస్లిం లాయర్ కు ఆహ్వాన పత్రిక పంపించింది. ఇది హిందువులకు సంబంధించిన వేడుక కాబట్టి, ఆ వర్గం వారికే ఆహ్వానాలు అందుతాయన్న భావన దాదాపు అందరిలోనూ ఉంది. కానీ.. అది అవాస్తవమని రామాలయ ట్రస్టు నిరూపించింది.
హిందూ, ముస్లిం అనే తేడాలేమీ ఉండవని.. అందరూ సమానమేనని చాటి చెప్పింది. ముస్లిం అయిన ఇక్బాల్ అన్సారీని ఆహ్వానించడమే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. రామజన్మభూమి, బాబ్రీ మసీదు భూ వివాదం కేసులో ఇక్బాల్ అన్సారి ఒక మాజీ న్యాయవాది. ఆయన బాబ్రీ మసీదుకు కీలక మద్దతుదారుగా ఉన్నారు. అంతకుముందు ఆయన తండ్రి హషీమ్ అన్సారీ (95) ఈ కేసులో న్యాయవాదిగా ఉన్నారు.
ఆయన 2016లో మృతి చెందిన తర్వాత ఇక్బాల్ ఈ కేసుని కోర్టులో ముందుకు తీసుకెళ్లారు. రామ మందిర నిర్మాణానికి వ్యతిరేకంగా గొంతెత్తలేదు కానీ.. బాబ్రీ మసీదు విషయంలో న్యాయం జరగాలని ఇక్బాల్ వాదించారు. ఆయనకు ఇప్పుడు రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానం అందడం ఆసక్తిగా మారింది. మరో విశేష ఘట్టం ఏమిటంటే.. డిసెంబర్ 30న ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో పర్యటించినప్పుడు, ఆయన్ను పూలవర్షంతో ఘనంగా స్వాగతించిన వ్యక్తుల్లో ఇక్బాల్ అన్సారీ కూడా ఉన్నారు.
ప్రధాని మోదీ తమ ప్రాంతానికి వచ్చారని, ఆయన అతిథి అని, అలాగే ఈ దేశానికి ప్రధానమంత్రి అని ఇక్బాల్ పేర్కొన్నారు. దర్శనం కోసం ప్రధాని మోదీ అయోధ్యకు రావడం సంతోషకరమైన విషయమని అన్నారు. రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రధాని మాత్రమే నిర్వహించాలని ఆయన సూచించారు.