06-01-2024 RJ
జాతీయం
బెంగళూరు, (జనవరి 6): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. సూర్యున్ని అధ్యయనం చేసేందుకు నింగిలోకి పంపించిన ఆదిత్య ఎల్1స్పేస్ క్రాప్ట్ విజయవంతంగా తన గమ్యస్థానాన్ని చేరుకుంది. ఈ స్పేస్ క్రాప్ట్ ను తుది కక్ష్యలోకి ప్రవేశ పెట్టేందుకు శనివారం చేపట్టిన కీలక పక్రియ విజయవంతమైంది. భూమి నుంచి సూర్యుని దిశగా 15 లక్షల కి.మీ దూరంలోని లగ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉన్న హాలో కక్ష్యలోకి ఈ వ్యోమనౌకను సాయంత్రం 4 గంటలకు ప్రవేశపెట్టారు.
ఈ ఉపగ్రహం ఐదేళ్ల పాటు సేవలందించనుంది. హాలో కక్ష్య నుంచి ఇది నిరంతరం సూర్యున్ని పర్యవేక్షిస్తుంది. ఈ విషయాన్ని ప్రధాని మోడీ ట్వీట్ చేసి తెలిపారు. ప్రయోగం విజయవంతం చేసిన శాస్త్రవేత్తలను అభినందించారు. భారతదేశం మరో మైలురాయిని చేరిందని ప్రకటన చేశారు. భూమి నుంచి సూర్యుని దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో గల లగ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉన్న హాలో కక్ష్యలోకి ఆదిత్య ఎల్1ను శాస్త్రవేత్తలు పంపించారు. అక్కడ సూర్యుడిని నిరంతరం పర్యవేక్షిస్తోంది.
సౌర వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేయడం ఆదిత్య ఎల్ 1 లక్ష్యం. సూర్యుడిని పరిశోధించేందుకు ఇస్రో చేపట్టిన తొలి మిషన్ ఇదేననే సంగతి తెలిసిందే. గత ఏడాది సెప్టెంబర్ 2వ తేదీన శ్రీహరికోట నుంచి ప్రయోగం చేపట్టారు. వ్యోమనౌక ఏడు పేలోడ్లను మోసుకెళ్లింది. సౌర వాతావరణం, సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్ తదితర అంశాలను అధ్యయనం చేసేందుకు కీలక సమాచారాన్ని ఆదిత్య ఎల్1 అందించనుంది.