06-01-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, (జనవరి 6): పోలీస్ వ్యవస్థతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పట్టించారని టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. శనివారం నాడు ఢిల్లీ వేదికగా ఆయన మాట్లాడుతూ... నాలుగేళ్ల 9నెలల జగన్మోహన్రెడ్డి పాలన విధ్వంసకరం, నియంత్రత్వం, అవినీతి, అబద్దాలమయంగా ఉందన్నారు. ఆంధప్రదేశ్ విడిపోయినప్పుడు జరిగిన నష్టం కంటే, జగన్ పాలనలో జరిగిన నష్టమే ఎక్కువని చెప్పారు.
రాష్ట్రం తిరిగి కోలుకోవడానికి కనీసం 15 ఏళ్లు పడుతుందని.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప రాష్ట్రానికి, ప్రజలకు భవిష్యత్ లేదని తెలిపారు. 2024 ఎన్నికల్లో టీడీపీ - జనసేన ప్రభుత్వాన్ని గెలిపించి, చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేస్తేనే రాష్ట్రానికి విముక్తి.. ప్రజలకు సంతోషమని చెప్పారు. 99 శాతం హామీలు అమలుచేశామంటూ ప్రజలను మోసగించడం కాదు.. టీడీపీ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నించారు.
మద్యం నిషేధం.. సీపీఎస్ రద్దు... ప్రత్యేకహోదా.. 2.30లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ... అంగన్వాడీ, మున్సిపల్ కార్మికుల జీతాల పెంపు హామీలు ఏమయ్యాయని నిలదీశారు. జలయజ్ఞం కింద ప్రతి ఎకరాకు నీళ్లిస్తామన్నారని.. ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకు ఇచ్చారని ప్రశ్నించారు. పోలవరం, అమరావతి నిర్మాణాల మాటేమిటని..
ఏటా ప్రతి రైతుకి, కౌలురైతుకి రూ.12,500 ఆర్థికసాయం సంగతే మిటని నిలదీశారు. నవరత్నాలు మేనిఫెస్టో పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో జగన్ అమలు చేసింది కేవలం 15శాతమేనని తెలిపారు. 85 శాతం హామీల అమల్లో ఫెయిల్ అని టీడీపీ ముద్రించిన పుస్తకంలోని అంశాలపై వాస్తవాలతో శ్వేతపత్రం విడుదలచేసే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా అని సవాల్ విసిరారు.
హామీల అమలుపై వాస్తవాలు వెల్లడించాకే జగన్ ప్రజలను ఓట్లు అడగాలని చెప్పారు. సంక్షేమ రంగానికి చేసిన ఖర్చు మౌలిక వసతులు, రాష్ట్రాభివృద్ధికి చేసిన ఖర్చుకి సంబంధించిన వాస్తవాలు బహిర్గతం చేయాలన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ... అప్పుల వివరాల తాలూకా వాస్తవాలు కూడా తక్షణమే ముఖ్యమంత్రి ప్రజల ముందు ఉంచాలని కనకమేడల రవీంద్రకుమార్ పేర్కొన్నారు.