06-01-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, (జనవరి 6): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 14న ప్రారంభించనున్న 'భారత్ జోడో న్యాయ్ యాత్ర లోగోను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. ఈ యాత్ర న్యాయం జరిగే వరకు' అన్నారు.
పార్లమెంట్ సమస్యలు లేవనెత్తేందుకు ప్రభుత్వం అనుమతించట్లేదని, అందుకే తాము ఈ న్యాయ యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. మణిపుర్లో ఇటీవల ఎన్నో దురదృష్టకర ఘటనలు చోటుచేసుకున్నాయన్నారు.
వాటిపై ప్రధాని మోదీ అనేక చోట్ల ప్రసంగాలిచ్చారు కానీ.. ఆ రాష్ట్రానికి మాత్రం వెళ్లలేదన్నారు. దీనిపై మాట్లాడేందుకు మాకు అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ చరిత్రలోనే తొలిసారి 146 మంది ఎంపీలను సస్పెండ్ చేశారని, అందుకే తమ గళాన్ని వినిపించేందుకు ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్పారు.
రాహుల్ గాంధీ నేతృత్వంలో జనవరి 14న ప్రారంభమయ్యే 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' మార్చి 30న ముగుస్తుందని ఖర్గే చెప్పారు. 66 రోజులపాటు 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల మీదుగా దాదాపు 6,713 కిలోమీటర్ల పాటు యాత్ర కొనసాగనుందన్నారు.