10-01-2024 RJ
జాతీయం
అయోధ్య, జనవరి 10: అంతారామమయం.. ఈ జగమంతా రామమయం అన్నట్లుగా అయోధ్య సర్వాంగ సుందరంగా..అధ్యాత్మిక నగరంగా రూపుదిద్దుకుంటోంది. ఎక్కడ చూసినా రామాయణం తాండవిస్తోంది. 22న ఆలయ ప్రతిష్టాపనకు చురుకుగా ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయి. అయోధ్యలో అడుగుపెట్టగానే ఆధ్మాత్మిక వాసనలు కనిపిస్తున్నాయి. అయోధ్యలో ఈ నెల 22న నూతన రామాలయంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది.
ఈ నేపధ్యంలో మున్ముందు అయోధ్యలో అనేక అభివృద్ధి పనులు జరగనున్నాయి. తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విలేకరుల సమక్షంలో అయోధ్యలో అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అయోధ్యలో సెవెన్ స్టార్ హోటల్ నిర్మిస్తామని, దానిలో శాకాహారం అందిస్తామని యూపీ సీఎం యోగి తెలిపారు. అలాగే ప్రతీయేటా అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ ఉత్సవం నిర్వహిస్తామని అన్నారు. ఎప్పుడో పదేళ్ల క్రితమే జరగాల్సిన ఉత్సవం ఇప్పుడు జరుగుతోందని అన్నారు.
ఈ నెల 22న అయోధ్యలో జరిగే ఉత్సవం వెలుగుల పండుగ దీపావళి లా ఉంటుందని అన్నారు. అయోధ్యలో హోటళ్ల ఏర్పాటుకు సంబంధించి 25కు పైగా ప్రతిపాదనలు వచ్చాయన్నారు. వాటిలో ఒకటి కేవలం శాకాహారం అందించే సెవెన్ స్టార్ హోటల్ అని తెలిపారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులపై స్థానిక అధికారులతో చర్చించామని అన్నారు. అయోధ్యకు దేశంలోని నలుమూలల నుంచి రోడ్డు, విమాన, రైలు కనెక్టివిటీ ఏర్పడిందన్నారు.
వీధి వ్యాపారులు వ్యాపార నిర్వహణ కు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. అయోధ్యలో గ్రీన్ కారిడార్ నిర్మిస్తామని, రామభక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. గత రామనవమికి ఐదు లక్షల మంది భక్తులు అయోధ్య కు వస్తారని అంచనా వేయగా, ఆ సంఖ్య 35 లక్షలు దాటిందని ముఖ్యమంత్రి తెలిపారు. అయోధ్యకు వచ్చే రామభక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఈ క్రమంలో ఈ నెల 22న జరగనున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా..
అయోధ్య విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం భారీగా భద్రత పెంచింది. 150 మందికి పైగా సిబ్బందిని సీఐఎస్ఎఫ్ యాంటీ టెర్రరిస్ట్ కవర్ ను మంజూరు చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీంతో మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలో 68 వ విమానాశ్రయ టెర్మినల్గా మారింది. 2023 డిసెంబర్ లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన అయోధ్య విమానాశ్రయా నికి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) భద్రత అందించనుంది.
ప్రయాణికులు రాకపోకలు సాగించే ఎయిర్ గేట్వే సదుపాయానికి ముప్పు ఉన్న నేపథ్యంలో ఎయిర్ పోర్టుకు భద్రత కల్పిస్తున్నట్లు సీఐఎస్ఎఫ్ వెల్లడించింది. ప్రారంభోత్సవం సందర్భంగా దేశ విదేశాల నుంచి పలువురు రానున్నందున అయోధ్యలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎయిర్ పోర్టు కు సెక్యూరిటీ కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. అవసరమైతే ఈ సంఖ్యను మరింత పెంచుతామన్నారు. మొదటి దశలో, విమానాశ్రయం 65,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. గంటకు రెండు నుంచి మూడు విమానాలు రాకపోకలు సాగించేలా నిర్మించారు.
బోయింగ్ 737, ఎయిర్బస్ 319, 320 ఈ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యేలా ఏర్పాట్లు చేశారు. రెండో దశలో రన్వే పొడవు 2,200 మీటర్ల నుంచి 3,700 మీటర్లకు పెరుగుతుంది. తద్వారా బోయింగ్ 787, బోయింగ్ 777 వంటి అంతర్జాతీయ విమానాలు అయోధ్యలో ల్యాండ్ అవుతాయి. 50,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఎయిర్ పోర్టు విస్తరించి ఉంటుంది.