10-01-2024 RJ
జాతీయం
గాంధీనగర్, జనవరి 10: భవిష్యత్తులో ప్రపంచంలోనే తృతీయ ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అంతర్జాతీయ ఏజెన్సీల అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని తెలిపారు. బుధవారం గుజరాత్లోని గాంధీనగర్ లో జరిగిన 'గుజరాత్ అంతర్జాతీయ సదస్సు 2024'లో ప్రధాని పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జయీద్ అల్ నహ్యాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆయన రాక భారత్-యూఏఈ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని మోదీ అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో స్థిరత్వానికి మూల స్తంభంగా, విశ్వమిత్రగా, సమస్యలకు పరిష్కారాలు కనుగొనగలిగే సాంకేతిక కేంద్రంగా, ప్రతిభావంతులైన యువత కలిగిన శక్తివంతమైన కేంద్రంగా భారత్ ను అంతర్జాతీయ సమాజం చూస్తోంది. ఉమ్మడి లక్ష్యాలను నిర్దేశిరచుకుని వాటిని సాధించగలమనే భావనను ప్రపంచ దేశాలకు భారత్ కలిగించిందని అన్నారు. ఇటీవలే భారత్ 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలు చేసుకుంది. రాబోయే 25 ఏళ్లు భారత్ కు అమృత కాలం.
ఈ 25 ఏళ్లలో భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రపంచంలో భారత్ మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందనేందుకు నాది భరోసా అని ప్రధాని మోదీ తెలిపారు. భారత చరిత్రలో నరేంద్ర మోదీ అత్యంత విజయవంతమైన ప్రధాని అని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ అన్నారు. గుజరాత్ అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న ఆయన.. ప్రధాని నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు.
'భారతీయులు ఎక్కువగా 'మోదీ హైతో ముల్కిన్ హై' అని ఎందుకు అంటున్నారని విదేశాల్లోని మిత్రులు నన్ను అడుగుతారు. దానికి నేను చెప్పే సమాధానం.. భారత ప్రధాని తన సంకల్పంతో సవాళ్లను అధిగమించి అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేశారు. అందుకే భారతీయులు మోదీ హైతో ముమ్కిన్ హై అంటారని చెప్పానని తెలిపారు.