10-01-2024 RJ
జాతీయం
ముంబయి, జనవరి 10: మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠకు తెరపడింది. శివసేనలో రెండు చీలిక వర్గాల మధ్య కొనసాగుతున్న యుద్ధంలో ఉద్ధవ్ ఠాక్రేకు ఎదురు దెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిందే వర్గమే అసలైన శివసేన అని స్పీకర్ రాహుల్ సర్వేకర్ ఆదేశాలు వెలువరించారు. శివసేన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఉద్ధవ్, ఏక్ నాథ్ శిందే వర్గాల పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బుధవారం స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు.
శిందే వర్గానికే మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారన్న ఆయన.. ఆ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయలేదు. అలాగే, శివసేన పార్టీ 2018 రాజ్యాంగాన్ని పరిగణించాలన్న ఉద్దవ్ వర్గం అభ్యర్థనను తోసిపుచ్చారు. ఎన్నికల కమిషన్కు 1999లో సమర్పించిన ఆ పార్టీ రాజ్యాంగం అసలైందని.. దాని ప్రకారం శివసేన ప్రముఖ్ ఉద్ధవ్ ఠాక్రేకు ఏ నేతనూ తొలగించే అధికారం లేదని తెలిపారు.