11-01-2024 RJ
జాతీయం
హైదరాబాద్, జనవరి 11: చాలామంది యువతలో ఆత్మస్థయిర్యం ఉండడం లేదు. ఉద్యోగం రాలేదనో.. ప్రేమించిన అమ్మాయి కాదన్నదనో.. చదవుకు డబ్బులు లేవనో.. ఇలా ఆత్మన్యూనతతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చిన్నచిన్న కారణాలతో పెద్దదైన జీవితాన్ని కోల్పోతున్నారు. ఈ ప్రపంచం విశాలమైనది. చిన్నచిన్న విషయాలకు కుంగిపోతే పెద్ద లక్ష్యాలను సాధించలేం.
అలాంటి వారు వివేకానందను స్ఫూర్తిగా తీసుకో వాలి. చిన్న వయసులోనే ఎన్నో విజయాలు సాధించిన ఉదాత్తమూర్తి స్వామి వివేకానంద. ప్రపంచానికే స్ఫూర్తిగా నిలిచిన మహనీయుడు ఆయన. నేటి యువతకు స్వామి వివేకానంద బోధనలు అనురణీయం. నిర్వీర్యమై, నిరాశా నిస్పృహలో కొట్టుమిట్టా డుతున్న యువత మేల్కోవాలి.
భారత దేశంలో ఎందరో మహానుభావులు అప్పుడప్పుడూ తళుక్కున మెరిసి జాతిని మేల్కొలిపారు. సమాజాన్ని రుజువర్తనలో పెట్టే ప్రయత్నాలు చేశారు. ఆ తరవాత వారి అడుగు జాడల్లో నడిచి దేశాన్ని ముందుకు తీసుకుని వెళ్లిన వారూ ఉన్నారు. అలాంటి మహానుభావుల్లో స్వామి వివేకానందుడు అగ్రగణ్యుడు అని చెప్పక తప్పదు.
వివేకానందుడు హిందూసమాజ పునరుజ్జీవ నానికి, సాంస్కృతిక జాతీయవాదాన్ని శక్తిమంతం చేయటానికి చేసిన కృషి అనన్య సామాన్యం. ఆయన బోధనలు ఇప్పుడు ప్రపంచ మానవాళి అనుసరిస్తూ ముందుకు సాగుతోంది. నిరాశలో కూరుకుపోయిన నేటియువత మేల్కో వాలి.
జాతిని జాగృతం చేసే బాధ్యతను తీసుకోవాల్సి ఉంది. వివేకానందుడు ఒక ఆధ్యాత్మిక వేత్త, దార్శనికుడు, సామాజిక పరివర్తకుడు. విచ్ఛిన్న కర శక్తుల ప్రాబల్యం పెరుగుతున్న క్రమంలో దేశాన్ని జాగృతం చేయాల్సిన అవసరం ఇప్పుడే ఉంది. తమకోసం.. తమవారి కోసం ..ఈ దేశంకోసం వారు నడుం బిగించాల్సి ఉంటుంది. దేశాన్ని రక్షించుకో వాల్సిన అవసరం మేరకు అడుగులు వేయాలి.
స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలి. జాతిని జాగృతం చేసి దేశ ఐక్యతకు నడుంబిగిస్తేనే.. నవశకం ఆరంభం కాగలదని గుర్తించాలి. మహాత్ముల జీవితాలను చదవి ఉత్తేజితం కావాలి. ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు.. అంటాడు స్వామి వివేకానంద.. ఆయన మాటలన్నీ ప్రేరణకు స్ఫూర్తిగా నిలిచేవే.
భారతదేశాన్ని చదవాలంటే వివేకానందుణ్ని చదివితే చాలు. రామకృష్ణ పరమహంస వద్ద నాలుగేళ్ల శుశ్రూషలో నరేంద్రుడు నేర్చుకున్న ఆదర్శాలే తరవాత అతడిని మహనీయుడిగా తీర్చిదిద్దాయి. సంపద సృష్టికర్తలైన శ్రామికులే ఈ దేశ ఆశాకిరణాలని స్వామి వివేకానంద ఆనాడే చెప్పారు.
18, 19 శతాబ్దాల్లో స్తబ్ధమైన భారతీయ సమాజాన్ని మేల్కోల్పడానికి రాజారామ్ మోహన్ రాయ్, కేశవచంద్రసేన్, దయానంద సరస్వతి సారథ్యంలో కొనసాగిన సంస్కరణోద్యమాన్ని వివేకానందుడు గొప్ప ముందడుగు వేయించాడు. అనేక ప్రాచీన చింతనా ధోరణు లను స్ఫూర్తిగా తీసుకొని స్పష్టమైన దృక్పథంతో కార్యాచరణతో జ్ఞాన విప్లవాన్ని వివేకానందుడు ఆరంభించాడు.
వ్యవస్థీకృతమైన రుగ్మతలను ఎదిరించడం, సంస్కరించడం వంటి వివేకానందుడి విప్లవా త్మక భావాలు ఇప్పటికీ అనుసరణీయంగా ఉన్నాయి. మృత ప్రాయంగా ఉన్న వ్యవస్థకు కొత్త ఊపిరిపోసి, కొత్త నెత్తురు ఎక్కించిన పునరుజ్జీవన, జాతీయోద్యమ, విప్లవోద్యమ కేంద్ర స్థానమైన బెంగాల్ మాగాణంలో ఉద్భవించిన మేధావి వివేకానందుడు. మనషిలో నిగూఢమై ఉన్న పరిపూర్ణ త్వాన్ని వ్యక్తం చేయించేది విద్య అని వివేకానందుడు నిర్వచించాడు. జీవితాన్ని నిర్మించడమూ, సద్గుణ సంపన్నులైన మనుషులను రూపొందించడమూ విద్య ఆశయాలుగా ఆయన పేర్కొన్నాడు.
విద్యలో సమాన అవకాశాలను కల్పించిన ప్రాచీన నలంద, తక్షశిల, విక్రమశిల, వల్లభి విద్యలయాల సుసంపన్న సంప్రదాయాన్ని పునఃప్రతిష్టింప చేయాలని, ప్రభుత్వము, పౌరసమాజం విద్యను అందించడమే ప్రథమ కర్తవ్యంగా చేపట్టాలని ప్రజలను చైతన్యవంతం చేశాడు.
ఆ నాటి సమాజంలో వ్యవస్థీకృతమైన రుగ్మతలను ఎదిరించడం సంస్కరించడం వంటి వివేకానందుడి విప్లవాత్మక భావాలు ఇప్పటికీ ప్రాసంగికతను కలిగివున్నాయి. పునరుద్ధరణవాద, తిరోగమన, విచ్ఛిన్నకర శక్తుల, సామాజిక బాధ్యత లేని పెట్టుబడి దారీ శక్తుల ప్రాబల్యంతో పేదరికం, అశాంతి, అసహనం నెలకొన్న ప్రస్తుత సమాజాన్ని మానవత్వం వైపు మళ్ళించడానికి వివేకానందుని కృషిని కొనసాగించడమే మార్గం. దేశం పరాయిపాలన నుంచి విముక్తం అయ్యాక స్వార్థ రాజకీయ శక్తుల చేతుల్లో ఓడిపోతోంది. ఈ క్రమంలో యువత బాగా ఆలోచించాలి.
పేదరికం, అశాంతి, అసహనం నెలకొన్న ప్రస్తుత సమాజాన్ని మానవత్వం వైపు మళ్ళించడానికి వివేకా నందుని కృషిని కొనసాగించడమే మార్గంగా ఎంచుకోవాలి. పేదవాని కష్టంతో పైకి వచ్చిన పాలకులు.. వారి బాగోగులను పట్టించుకోవడం లేదు. ఎప్పుడో వివేకానందుడు ఇలాంటి వన్నీ తన ప్రసంగాలతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించారు. ఎంతో తత్వజ్ఞానం పొందిన స్వామి వివేకానంద మనలో ఉన్న జాడ్యాన్ని తొలగించి... ఉత్తేజితం చేసి ప్రేరణ కల్పించడానికి పుట్టిన ఓ మహాయుగకర్తగా భావించాలి. ప్రతి మతంలోను, ప్రతి సిద్ధాంతంలోను, ఎంతో కొంత మంచి వుంటుంది. సోదరప్రేమ గురించి ప్రసంగాలు మాని, ఆ ప్రేమను కార్యరూపంలో ప్రదర్శించండని పిలుపును ఇవ్వడమే కాదు.... ఆచరించి చూపాడు. వివేకానందుడు ప్రవచించిన మార్గం ఎప్పటికీ అనుసరణీయమే.
దరిద్ర నారాయణసేవే పరమధర్మమని వివేకానందుడు అంటారు. మానవాళికి చైతన్య దీప్తిగా స్వామి వివేకానంద విశ్వవిఖ్యాతి పొందినాడు. కర్మ, భక్తి, రాజ, జ్ఞాన యోగాలపై ఆయన చేసిన రచనలు ఆత్మశక్తిని వెలికితీసే ఆయుధాలు. గాంధీలాంటి అహింసా మూర్తులకూ, సుభాష్ చంద్రబోస్, అరవింద్ ఘోష్, జతిన్దాస్ లాంటి అతివాదులకూ వివేకానందుడు స్ఫూర్తిగా నిలిచారు. అలాంటి బాటలో మనమెందుకు నడవకూడదన్న ఆలోచన చేయాలి. ప్రాచీన కాలపు గ్రీసులో సోక్రటీసు గొప్ప గురువు. ప్లేటో గొప్ప శిష్యుడు. గురువంటే రామకృష్ణుడు. శిష్యుడంటే వివేకానందుడు అలా ఉద్భవించారు.
ప్రజలు విద్యకు, విజ్ఞానానికి దూరంగా మూఢవిశ్వాసాలకు, దారుణ సాంఘిక దురాచార కబంధహస్తాల్లో నలిగి పోవడం చూడలేక చైతన్యదీప్తి రగిలించాడు. భారతీయ మూలాల నుండి నిజమైన వేదాంత దృక్పథాన్ని రూపొందించి, జాతిమత పరమైన అన్ని రకాల అధిపత్యాలను, రూపుమాపే ప్రజాస్వామిక సిద్ధాంతంగా మార్చాడు. 1893లో చికాగో నగరంలో ప్రపంచ మత సదస్సుకు హాజరై భారతీయ తత్వసారాన్ని అద్భుత రీతిలో తెలియజేసి, ప్రపంచాన్ని ఆకట్టుకున్నాడు.