11-01-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జనవరి 11: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర జనవరి 14న మణిపూర్ నుంచి ప్రారంభం కానుందని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి శమా అహ్మద్ పేర్కొన్నారు. మీడియా సమావేశంలో ఈ మేరకు తెలిపారు. మణిపూర్ ప్రారంభమయ్యే ఈ యాత్ర దేశంలోని 15 రాష్ట్రాల గుండా కొనసాగి ముంబయిలో ముగుస్తుందన్నారు. ఈ క్రమంలో యాత్రలో భాగంగా 110 జిల్లాలు, 100 లోక్ సభ స్థానాలు, 337 అసెంబ్లీ స్థానాలను కవర్ చేయనున్నట్లు చెప్పారు.
ఈ యాత్ర కోసం కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధం కావాలని సూచించారు. అంతేకాదు ఈ యాత్రలో భాగంగా దేశంలోని సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలను ప్రస్తావించనున్నట్లు చెప్పారు. దీంతోపాటు దేశంలో యువత ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తు చేశారు.
బీజేపీ ప్రభుత్వం ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిందని శమా అహ్మద్ ఆరోపించారు. మరోవైపు నిత్యావసరాల ధరలతోపాటు ఇంధన ధరలు కూడా భారీగా పెరిగిపోయాయని అన్నారు. ప్రధాని మోదీ అబద్దాలు చెబుతూ సామాన్య ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి విమర్శించారు.
దీంతోపాటు పలు చోట్ల ఆదివాసీ, అల్ప వర్గాల మీద దాడులు జరుగుతున్నాయని అన్నారు. బీజేపీ ప్రభుత్వ హాయాంలో మహిళలపై జరిగిన దాడులకు న్యాయం జరగడం లేదని ఎద్దేవా చేశారు. అంతేకాదు ప్రశ్నించిన వారి గొంతు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇక బ్రిజ్ భూషణ్ విషయంలో ఆధారాలతో సహా తప్పిదాలు జరిగినట్లు ఫిర్యాదులు అందినా కూడా ఇప్పటివరకు అతనిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని శమా అహ్మద్ ప్రశ్నించారు.