11-01-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జనవరి 11: స్వచ్ఛ సర్వేక్షన్ లో ఆంధ్రప్రదేశ్ కు అవార్డుల పంట పండింది. అఖిలభారత స్థాయిలో నాలుగు ర్యాంకులను రాష్ట్రం కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. స్వచ్ఛ సర్వేక్షన్ 2023లో ఏపీ నాలుగు జాతీయ అవార్డులు, ఒక రాష్ట్ర స్థాయి అవార్డు గెలుచుకుందన్నారు. దక్షిణ భారత దేశంలో క్లీన్ సిటీలలో ఏపీ నెంబర్ వన్గా నిలిచిందన్నారు. జాతీయ స్థాయిలో గుంటూరుకు ఆలిండియా 2వ ర్యాంకు, గ్రేటర్ విశాఖపట్నంకు ఆలిండియా 4వ ర్యాంక్, విజయవాడకు ఆలిండియా 6వ ర్యాంక్, తిరుపతికి ఆలిండియా 8వ ర్యాంకు వచ్చిందని తెలిపారు.
పులివెందుల మున్సిపాలిటీకి క్లీన్ సిటీ ఆఫ్ ఏపీ అవార్డు వచ్చిందని చెప్పారు. వైఎస్ జగన్ ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికి చేస్తున్న కృషికి ఈ అవార్డులు చిహ్నమన్నారు. సీఎం వైఎస్ జగన్ క్లీన్ ఏపీ (క్లాప్) ప్రోగ్రాం సక్సెస్ అయ్యిందన్నారు. తడి, పొడి చెత్తను సమర్ధంగా నిర్వహణ జరుగుతోందని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.