17-01-2024 RJ
జాతీయం
పాట్నా, జనవరి 17: ఇండియా కూటమి నేతలు ఒక్కొక్కరుగా అయోధ్య కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నారు. తొలుత కాంగ్రెస్ అగ్రనేతలు ప్రతిష్టాపనను బహిష్కరించగా, ఇప్పుడు వారి అడుగుజాడల్లో మిగతావారు కూడా నడుస్తున్నారు. ఈనెల 22న అయోధ్యలో జరగనున్న రామమందిర శంకుస్థాపన కార్యక్రమంలో తాను పాల్గొనబోనని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ స్పష్టం చేశారు. బుధవారం ఉదయం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 'నేను అయోధ్యలో రామమందిర శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లను' అని అన్నారు.
ఇంకా నిర్మాణం దశలోనే ఉన్న రామ మందిర ప్రాణప్రతిష్ఠపై కొన్ని రోజులుగా మత పరమైన అంశాన్ని రాజకీయం చేస్తున్నారంటూ బీజేపీ, ప్రధాని మోదీపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ క్రమంలో పలువురు తాము ఈ వేడుకకు రామని తేల్చి చెప్పేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ, ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మమతా బెనర్జీ సహా పలువురు నేతలు ఈ కార్యక్రమ ఆహ్వానాన్ని తిరస్కరించిన విషయం తెలిసిందే.
తాజాగా లాలూ కూడా ఆ కూటమిలో చేరారు. అయోధ్య రథయాత్రను అద్వానీ ప్రారంభించిన సందర్భంగా బీహార్ లో నాడు సిఎంగా ఉన్న లాలూ రథయాత్రను అడ్డుకుని అద్వానీని అరెస్ట్ చేశారు. రాబోయే లోక్ సభ ఎన్నికల కోసం మహాకూటమి మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకాల ఏర్పాటులో జాప్యంపై స్పందించిన లాలూ.. సీట్ల పంపకాలకు ఏర్పాట్లకు చాలా సమయం పట్టవచ్చని బదులిచ్చారు.
సీట్ల పంపకంపై లాలూ చేసిన వ్యాఖ్యకు పలువురు సీనియర్ జేడీ(యూ) నేతలు అనేక సందర్భాల్లో సీటు షేరింగ్ కసరత్తు నెమ్మదిగా సాగడంపై తమ ఆందోళనను వ్యక్తం చేశారు. బీహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) అధ్యక్షుడు నితీష్ కుమార్ కూడా అంతకుముందు ఇండియా కూటమి తన భవిష్యత్తు వ్యూహాలను త్వరగా ఖరారు చేయాలని అన్నారు.