18-01-2024 RJ
జాతీయం
విజయవాడ, జనవరి 17: తెలుగు రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన మహానటుడు, ఆధునిక సామాజికవేత్త నందమూరి తారకరాముడు. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న నాయకుడిగా చరిత్ర కెక్కారు. ఆయన రాజకీయాల్లోకి రాకముందు స్తబ్దుగా ఉన్న రాజకీయరంగంలో కొత్త తరం ఉద్భవించింది.
కొత్తవారు రాజకీయంగా పైకి వచ్చారు. ఎందరినో మంత్రులను, ఎంపిలను చేసిన ఘనత నాటి సిఎంగా ఎన్టీఆర్ కు దక్కింది. అణగారిన కులాలను, వర్గాలను అక్కున చేర్చుకుని వారికి రాజకీయంగా పదవులను కట్టబెట్టారు.
1996 జనవరి 18న ఎన్టీఆర్ మహాభినిష్క్రమణ చేసి అప్పుడే ఇరవై ఏడేళ్లు దాటింది. అయినా నేటికీ ఆయన జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచపోయారు. ఉమ్మడి ఎపిలో ఆయన తెలుగుదేశం పార్టీని పెట్టి, 9నెలల స్వల్పకాలంలోనే కాంగ్రెస్ పార్టీని కూకటివేళ్లతో పెకిలించారు. ఆనాటి రాజకీయాల్లో ఆయన చరిత్ర సృష్టించారు. అన్నగా జనం గుండెల్లో నిలిచారు. ఇక చిత్రసీమలోనూ ఎందరికో చేయూతనిచ్చి ఆదుకున్నారు. అందుకే ఈ నాటికీ రామారావు జనం మదిలో అన్నగా కొలువై ఉన్నారు.
తెలుగు చిత్రపరిశ్రమకు పెద్దాయన'గా నిలచిన నటరత్న ఎన్టీఆర్ నా అనుకున్నవారిని ఆదుకున్న తీరును ఈనాటికీ సినీజనం తలచుకుంటూ ఉన్నారు. అలా ఆయన అభిమానంతో వెలుగులు విరజిమ్మిన వారెందరో. తెరపై అనేక మార్లు శ్రీకృష్ణ పరమాత్మగా నటించి అలరించారు రామారావు. ఆపదలో ఉన్న భక్తులను ఆదుకొనే కన్నయ్యగా నటించడమే కాదు, నిజ జీవితంలోనూ ఎన్టీఆర్ అదే తీరున సాగడం విశేషం. ఎన్టీఆర్ ఓ సారి నమ్మితే వారి కోసం ప్రాణమిస్తారని ప్రతీతి.
ఎన్టీఆర్ విజయవాడలో చదువుకొనే రోజుల్లో నాటకాలు వేశారు. తాను సినిమా రంగంలో అడుగుపెట్టగానే, తన తమ్ముడు త్రివిక్రమరావును, బావగారు పుండరీకాక్షయ్యను మదరాసు పిలిపించుకొని వారిద్దరినీ భాగస్వాములుగా చేసి ఎన్.ఏ.టి. సంస్థపై చిత్రాలను నిర్మించారు...
ఆ తరువాత పుండరీకాక్షయ్యను సోలో ప్రొడ్యూసర్ గానూ చేశారు. రామారావుతో పుండరీకాక్షయ్య 'శ్రీకృష్ణావతారం, భలేతమ్ముడు, ఆరాధన' వంటి అనేక విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. అలాగే తనతో ఎన్నో చిత్రాల్లో నటించిన సత్యనారాయణకూ 'గజదొంగ'కు కాల్ షీట్స్ ఇచ్చారు.
ఆ సినిమా ఎంత పెద్ద హిట్టో చెప్పక్కర్లేదు... ఇక యన్టీఆర్ తో 'సంసారం, దాసి' చిత్రాల్లో నాయికగా నటించిన లక్ష్మీరాజ్యం అడగ్గానే 'నర్తనశాల'లో అర్జున, బృహన్నల పాత్రల్లో అభినయించి అలరించిన తీరును ఎవరు మాత్రం మరచి పోగలరు? తరువాతి రోజుల్లో ఆమె నిర్మించిన 'మగాడు'లోనూ యన్టీఆర్ నటించారు. అలాగే తనతో పలు చిత్రాల్లో నటించిన భానుమతి సొంత చిత్రాల్లో నటించారు రామారావు.
ఎన్టీఆర్ 'తాతమ్మకల'లో నటించినందుకు భానుమతి కోరగానే ఆమెకు కాల్ షీట్స్ ఇచ్చారు... ఎన్టీఆర్ వంటి సూపర్ స్టార్ కాల్ షీట్స్ ఇచ్చినా 'అమ్మాయి పెళ్ళి' అనే సాధారణ చిత్రం తీశారు భానుమతి. తన 'పల్లెటూరు'తోనే నాయికగా పరిచయమైన సావిత్రి దర్శకత్వం వహించిన 'మాతృదేవత'లో నటించి, ఆమెను డైరెక్టర్ గా ప్రోత్సహించారు. ఎన్టీఆర్ ఇటు రాజకీయ, చిత్రరంగాల్లో తనదైన ముద్రవేయడమే గాకుండా చరిత్ర సృష్టించిన మహనీయుడు. తెలుగు రాజకీయాల్లో చెరగని ముద్రవేసిన నాయకుడు ఎన్టీఆర్. ఆయన రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించారు.