18-01-2024 RJ
జాతీయం
సిరిసిల్ల, జనవరి 18: అయోధ్య శ్రీరామచంద్రుడికి సిరిసిల్ల నుంచి బంగారు చీరను కానుకగా పంపించనున్నారు. సిరిసిల్లకు చెందిన నేతన్న హరిప్రసాద్ స్వయంగా తయారు చేసిన బంగారు చీరను ఈ నెల 26న ప్రధాని నరేంద్ర మోదీకి అందించనున్నారు. ప్రధాని చేతుల మీదుగా శ్రీరాముడి పాదాల చెంత ఈ చీరను ఉంచనున్నారు. ఈ క్రమంలో నేతన్న హరిప్రసాద్ నివాసానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ వెళ్లి.. బంగారు చీరను పరిశీలించారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. సిరిసిల్లలో అద్భుతమైన చేనేత కళాకారులు ఉన్నారని.. గతంలో అగ్గిపెట్టేలో పట్టే చీరను తయారుచేసిన చరిత్ర సిరిసిల్ల జిల్లాకు ఉందని గుర్తు చేశారు. ఇంతటి గొప్ప నైపుణ్యాన్ని సొంతం చేసుకున్న చేనేత రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
చేనేత కార్మికులను ఆదుకునేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చీరను 8 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండితో రూపొందించారు. రామాయణ ఇతివృత్తం తెలియజేసే చిత్రాలతో ఈ చీరను చేనేత కళాకారుడు హరిప్రసాద్ తయారు చేశారు.