19-01-2024
జాతీయం
అయోధ్య, జనవరి 19: అంతా రామమయం.. జగమంతా రామమయం అన్నట్లుగా ఇప్పుడు దేశమంతా రామనామంతో మార్మోగుతోంది. దేశమే కాదు..ప్రపంచమంతా ఆయోధ్యవైపు ఆసక్తిగా చూస్తోంది. రామాలయ ప్రాణప్రతిష్ట కోసం రామకోటి.. కోటానుకోట్ల జనకోటి ఎదురుచూస్తోంది. ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తోంది. ఈ నెల 22న జరిగే ప్రాణప్రతిష్టలో అత్యంత కీలకమైన రామ్లల్లా విగ్రహం గర్భగుడికి చేరిన ఘట్టం అత్యంత భక్తిశ్రద్దలతో చేపట్టారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా అయోధ్య అక్షితలు ఊరూరా చేరుతున్నాయి. ప్రజలంతా ఉజ్వల ఘట్టం కోసం ఎదురు చూస్తున్నారు. తమ జీవితకాలంలో ఇలాంటి ఘట్టాన్ని చూస్తామని ఊహించలేదని పరవశించి పోతున్నారు. అయోధ్య ఇప్పుడు ప్రపంచ ఆధ్యాత్మిక నగరిగా విలసిల్లనుంది. ఈ ఆలయ ప్రతిష్ఠలో ఇప్పుడన్నీ విశేషాలే. వెయ్యేళ్లయినా చెక్కుచెదరని విధంగా ఇనుము, సిమెంట్ లేకుండా ఆలయ నిర్మాణం జరిగితే.. ఆలయ నిర్మాణంలో దేశంలోని ప్రముఖ ప్రదేశాల మట్టి, నదులు, సముద్రాల నీటిని ఉపయోగించారు.
నేపాల్ సాలిగ్రామ శిలను బాలరాముడి విగ్రహం కోసం ఉపయోగించారు. ద్వారాలను హైదరాబాద్ నుంచి తెప్పించారు. గంటలను తమిళనాడు నుంచి రప్పించారు. తిరుమల శ్రీవారి చెంత నుంచి లడ్డూ ప్రసాదాలు వస్తున్నాయి. ఇలా దేశం యావత్తూ ఏదో విధంగా అయోధ్య రామాలయంలో అనుబంధం పొందేలా ఆలయ నిర్మాణం జరుపుకోవడం విశేషం. ఈ క్రమంలో ఈ నెల 22న ప్రాణప్రతిష్ట తరవాత అయోధ్య ఇక భక్తులతో కిటకిటలాడనుంది.
22న జరిగే కార్యక్రమానికి సామాన్యభక్తులు రావద్దని ట్రస్ట్ సభ్యులు ఇప్పటికే విన్నవించుకున్నారు. అయోధ్యలో మరో అపూర్వ ఘట్టంగా మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు కావడం..విమానాల రాకపోకలు ప్రారంభం కావడంతో ప్రజలు సులువుగా అయోధ్యకు వెళ్లే అవకాశం దక్కనుంది. గురువారమే అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామమందిరం గర్భగుడి వద్దకు రామ్ లల్లా చేరుకున్నారు. నేపాల్ లోని కాళీనది నుంచి తీసుకొచ్చిన సాలిగ్రామ శిలతో తయారు చేసిన 51 అంగుళాల విగ్రహాన్ని గుడిలోకి చేర్చిన అనంతరం ఆలయాన్ని శుద్ధి చేసే పక్రియ చేపట్టారు.
జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతుల మీదుగా ఆలయంలో స్వామికి కుంకుమార్చన జరగనుంది. రామ్లల్లా విగ్రహ ప్రతిష్టలో చేసే పవిత్ర కార్యక్రమంలో భాగంగా తెల్లవారు జామున స్థానిక మహిళలు మహా కలశ యాత్ర చేపట్టారు. తర్వాత పూజలు చేసి రామాలయ ప్రాంగణం లోకి రామ్ లల్లా విగ్రహాన్ని తీసుకుని వెళ్లారు. ఈ రామ్ లల్లా విగ్రహం దాదాపు 200 కిలోల బరువు ఉంటుందని చెబుతున్నారు.
విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకెళ్లే ముందు యాగమండపం లోని 16 స్తంభాలు, నాలుగు ద్వారాలకు పూజలు చేశారు. ప్రధాన ఆలయంలోని 16 స్తంభాలు 16 దేవుళ్లకు చిహ్నాలు అని చెప్పారు. మండపం నాలుగు ద్వారాలు నాలుగు వేదాలను సూచిస్తున్నాయి. ప్రధాన ద్వారం వద్ద ఉన్న ఇద్దరు ద్వారపాలకులు నాలుగు వేదాలలోని రెండు శాఖలకు ప్రతినిధులుగా పేర్కొన్నారు. సుమారు 500 సంవత్సరాల పోరాటం తర్వాత శ్రీ రామ జన్మభూమికి విముక్తి లభించిందన్న సంగతి తెలిసిందే.
ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం నియమ నిబంధనల ప్రకారం నిర్వహిస్తారు. దేశ, విదేశాల నుంచి వేలాది మంది అతిథులు దీనిని తిలకించనున్నారు. మొదటి రోజు అంటే జనవరి 22న అందరినీ రాముడి గర్భగుడిలోకి అనుమతించనప్పటికీ, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత భక్తుల దర్శనం కోసం గర్భాలయం తెరచి ఉంచుతారు. ఐదు శతాబ్దాల కల సాకారం కానుండడంతో రామభక్తులు పలు రకాలుగా రామయ్య మీద తమ భక్తి శ్రద్ధలను ప్రదర్శిస్తున్నారు.
కొందరు వజ్రాల నగలు సమర్పిస్తే.. మరికొందరు భారీగా ప్రసాదాలను సమర్పిస్తున్నారు.. శ్రీరాముడు అత్తారిల్లు నుంచి భారీగా కానుకలను ఇప్పటికే అందుకున్నారు. శ్రీరామచంద్రుడికి నగలు నాణెళిలు కంటే.. తులసి అత్యంత పీతిపాత్రం. ఓ భక్తుడు.. రామయ్యను సేవించ డానికి ఏకంగా తులసి వనాన్ని సృష్టించాడు. బెంగుళూరు నగరానికి చెందిన ఒక భక్తుడు శ్రీరాముడిని తులసితో పూజించడానికి ఏకంగా తులసి వనాన్ని రెడీ చేశాడు. అయోధ్య సమీపంలో సుమారు 60 కిలోమీటర్ల దూరంలో రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేసి తులసి మొక్కలను పెంచుతున్నాడు.
గుజరాత్లోని తులసి అడవుల నుంచి కృష్ణతులసి విత్తనాలను తీసుకొచ్చి నాటారు. ప్రస్తుతం తులసి మొక్కలు పెరగడంతో బాల రామయ్య ప్రతిష్టాపన సమయంలో తులసి మాలను సమర్పించాలని నిర్ణయించారు. మొత్తంగా ఆధ్మాత్మిక విశ్వనగరి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అత్యద్భుత నిర్మాణ శైలితో..అయోధ్య రామమందిరం ప్రపంచాన్ని అబ్బురపరుస్తోంది. ప్రాణప్రతిష్ఠ కర్మకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నియమ నిష్టలతో దీక్ష చేస్తున్నారు. ప్రాణప్రతిష్టకు ఆతిథ్యం ఇవ్వడానికి అవసరమైన నియమాలపై ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
దీంతో ప్రధాని కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతూ, నేలపై దుప్పటి కప్పుకుని నిద్రపోతున్నారు. ప్రధాని మోదీ గత వారం రోజుల్లో మహారాష్ట్ర, కేరళ, ఆంధప్రదేశ్ లో కూడా పర్యటించారు. ఈ నేపథ్యంలోనే అయోధ్యలోని ప్రతి ఇంట్లో, ప్రతి దుకాణం లో ప్రతి చౌరస్తాలో రామనామం తాండవమాడుతోంది. రామాట నుండి అయోధ్యలోకి ప్రవేశి స్తున్నప్పుడు అక్కడ ఏర్పాటు చేసిన ఒక హోర్డింగ్ దీపావళి వేడుకలను గుర్తుచేసేలా ఉంది.
రామభజన, రామాయణానికి సంబంధించిన పాటలు వాడవాడలా ప్రతిధ్వనిస్తుండంతో రామభక్తులకు మరింత ఉత్సాహాన్ని అందిస్తున్నాయి. మరోవైపు అయోధ్యకు దేశ విదేశాల నుంచి భక్తులు, సాధుసంతులు చేరుకుంటున్నారు. ఇకపోతే రామ మందిరం ప్రాణ ప్రతిష్ట సందర్భంగా అరుదైన కానుకగా చేనేత మగ్గం పై బంగారు పట్టుచీరను సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు సిద్దం చేశాడు. సీతారాములకు సిరిసిల్ల బంగారు పట్టు చీర.. ప్రధాని మోడీ చేతుల మీదుగా అందిస్తానని తెలిపారు. రామయ్య కోసం తిరుమల శ్రీవారు కూడా తన ప్రసాదాన్ని పంపిస్తున్నారు.
దాదాపు 3 వేల కేజీల బరువు ఉన్న శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని విమానంలో అయోధ్యకు పంపేందుకు టీటీడీ ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. మొత్తంగా దేశం యావత్తూ ఈ క్రతువులో పాలుపంచుకోవడం మహద్భాగ్యంగా చూడాలి. రాముడి జన్మస్థానంలో ఆలయం నిర్మితం కావడం.. మనమంతా చూసే భాగ్యం కలగడం ఈయేటిమేటి ఘట్టంగా చరిత్రలో నిలిచిపోనుంది.