19-01-2024 RJ
జాతీయం
అయోధ్య, జనవరి 19: అయోధ్య ప్రాణపత్రిష్టకు సంబంధించి చేస్తున్న కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతున్నాయి. అనుకున్న ప్రకారం ఒక్కో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శాస్త్రోక్తంగా వేదోక్తంగా పూజాదికాలు సాగుతున్నాయి. ఈ నెల 22వ తేదీన బాల రాముడి విగ్రహానికి ఉన్న వస్త్రాన్ని తొలగించడంతో రామాలయంలో పూజలు ప్రారంభం అవుతాయి.
ప్రధాని మోదీ రామ్ లల్లాను దర్శించుకొని హారతి ఇస్తారని అయోధ్య ఆలయ వర్గాలు తెలిపాయి. గురువారం ఉదయం రాముడి విగ్రహాన్ని పవిత్ర నదీ జలాలతో అభిషేకించారు. తర్వాత గణేళిశాంబికా పూజ, వరుణ పూజ, చతుర్వేదోక్త పుణ్యాహవచనం క్రతువులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ట్రస్ట్ సభ్యులు డాక్టర్ అనిల్ మిశ్రా దంపతులు పూజల్లో పాల్గొన్నారు. అయోధ్య రామ మందిరం గర్భగుడిలోకి రామ్ లల్లా (బాలరాముడు) ప్రవేశించారు.
రామ్ లల్లా ఐదేళ్ల బాలుడిగా దర్శనం ఇస్తారు. ఆ విగ్రహం ఎలా ఉండనుందో అనే సందేహాం ప్రతి ఒక్కరిలో నెలకొంది. బాల రాముడి విగ్రహ ఫొటోను ఓ జాతీయ వార్తా సంస్థ విడుదల చేసింది. 51 అంగులాల పొడవు ఉన్న విగ్రహం పై భాగాన్ని తెల్లని వస్త్రంతో కప్పి ఉంచారు.
ఆ విగ్రహం సుందరంగా కనిపించింది. బాలరాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకొచ్చే సమయంలో శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు రామ నామాన్ని స్మరించారు. రామ్ లల్లా విగ్రహాన్ని మైసూర్ కు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ అందంగా తీర్చిదిద్దారు.