19-01-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జనవరి 19: దేశంలో మరో మూడు రోజుల్లో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానున్నది. కోట్లాది మంది భారతీయులు ఎన్నో ఏండ్లుగా ఎదురుస్తున్న అయోధ్య రామ మందిరం ఈనెల 22న ప్రారంభం కానున్నది. రాముల వారికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. ఈ చారిత్రక సన్నివేశంలో రైల్వే శాఖ కూడా భాగం పంచుకోనున్నది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా రామయ్య పేరుతో ఉన్న 343 రైల్వే స్టేషన్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది.
వివిధ రాష్ట్రాల్లో రాముని పేరుతో ఉన్న ఈ రైల్వే స్టేషన్లను విద్యుత్ దీపాలతో అలంకరించనున్నది. ఈ 343 స్టేషన్లలో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ఉన్నాయి. ఆంధ్రాలో 55 రైల్వేస్టేషన్లు ఉండగా, తమిళనాడులో 54 ఉన్నాయి. తర్వాతి స్థానంలో బీహార్ ఉన్నది.
తెలంగాణలో రామగుండం, రామకృష్ణాపురం, రామన్నపేట, ఆంధప్రదేశ్ లో రామచంద్రాపురం, రామాపురం, కర్ణాటకలో రామగిరి, రామనగరం, ఉత్తరప్రదేశ్ లో రామచంద్రాపూర్, రామంజ్, రామ్చరా రోడ్ ఇలా.. ఊరు పేరు చివర, ముందు రామ నామంతో ఉన్న రైల్వే స్టేషన్లను రైల్వేశాఖ సుందరీకరించనున్నది.
ఈ నెల 22 రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా.. ఆస్తా స్పెషల్ పేరుతో దేశ నలుమూలల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపనున్నది. ఆ తర్వాత వంద రోజులపాటు అయోధ్యకు వెళ్లాలనుకునే భక్తుల కోసం వెయ్యి రైళ్లను నడపడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. కాగా, ప్రత్యేక రైళ్లలో రానుపోను టికెట్లను ఒకేసారి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రైళ్లు గమ్య స్థానం చేరేవరకు మధ్యలో ఎక్కడా ఆగకుండా వెళ్లనున్నాయి.