19-01-2024 RJ
జాతీయం
అయోధ్య, జనవరి 19: భారత ప్రజలే కాకుండా.. యావత్ ప్రపంచంలోని హిందూ సమాజం మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది. మరో మూడు రోజుల్లో రామ మందిర ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం జరగనుంది. అయితే, ప్రాణ ప్రతిష్ఠకు ముందే.. రామాలయం గర్భగుడిలో బాల రాముడి ప్రతిమను ఆలయ నిర్వాహకులు ప్రతిష్ఠించారు. ఆ సుందర బాలరాముడిని చూసేందుకు రెండు కనులు చాలవంటే అతిశయోక్తికాదు.
బాలరాముడి తొలి చిత్రాన్ని శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వాహకులు విడుదల చేశారు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రస్తుతం విడుదలైన బాల రాముడి విగ్రహాన్ని కృష్ణ శిలతో శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కారు. 5 అడుగుల పొడవైన బాల రాముడి విగ్రహం బరువు 150 కేజీలు ఉంది. నల్లని పద్మపీఠంపై ఐదేళ్ల బాలుడి రూపంలో కొలువుదీరారు రామయ్య. ముఖంపై చిరుదరహాసంతో.. నుదిటన మూడు నామాలతో సుందర రూపంలో వెలిగిపోతున్నారు. బంగారు విల్లు, బాణం చేత పట్టుకుని శ్రీరాముడు నిల్చుని ఉన్నారు.
అభిజిత్ ముహూర్తంలో పుష్యశుక్ల ద్వాదశి రోజున ప్రాణప్రతిష్టాపన చేయనున్నారు. శ్రీరామనవమి రోజున గర్భగుడిలో సూర్యకిరణాలు పడేలా అద్భుతమైన టెక్నాలజీని ఉపయోగించారు. జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 12.20 - 1.00 గంటల మధ్య ప్రాణప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించనున్నారు. కాశీకి చెందిన జ్ఞానేశ్వర్ శాస్త్రి ఆధ్వర్యంలో రామాలయ ప్రతిష్టాపన పూజలు జరగనున్నాయి.