19-01-2024 RJ
జాతీయం
షోలాపూర్, జనవరి 19: చిన్నతనంలో నాక్కూడా ఇలాంటి ఓ ఇల్లు కావాలని ఆలోచించా.. కానీ అవకాశం రాలేదు... అంటూ ప్రధాని మోదీ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం మహారాష్ట్రలో పర్యటించారు. షోలాపూర్ లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన - అర్బన్ పథకం కింద పేద ప్రజలకు ఇళ్లను అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. తన బాల్యాన్ని గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. పీఎం అవాస్ యోజన కింద నిర్మించిన దేశంలోనే అతిపెద్ద సొసైటీని ప్రారంభించాం. దీనిపై 2014లో నేను హామీ ఇచ్చా. ఆ వాగ్దానం నెరవేరడం, దాన్ని చూడటానికి రావడం.. ఇవన్నీ పరిపూర్ణ క్షణాలు. ఈ ఇళ్లను చూడగానే బాల్యం గుర్తొచ్చింది.
చిన్నతనంలో నాక్కూడా ఇలాంటి ఇంట్లో నివసించే అవకాశం వస్తే ఎలా ఉండేదో అని ఆలోచించా అంటూ గద్గద స్వరంతో మాట్లాడారు. కన్నీళ్లను దిగమింగుకుని తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం గురించి ఆయన ప్రస్తావించారు. ఆ మహోన్నత ఘట్టాన్ని పురస్కరించుకుని 22వ తేదీన ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లో రామజ్యోతి వెలిగించాలని మరోసారి పిలుపునిచ్చారు.
శ్రీరాముడి నిజాయతీని మా ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుంది. మన విలువలు, కట్టుబాట్లను గౌరవించాలని ఆ భగవంతుడు బోధించాడు. అదే బాటలో నడుస్తూ పేదల సంక్షేమం, వారి సాధికారత కోసం మేం పనిచేస్తున్నాం అని ప్రధాని తెలిపారు. ప్రజల కలలే తమ ప్రభుత్వ హామీలని మోదీ అన్నారు.
గత ప్రభుత్వాల హయాంలో సంక్షేమ పథకాలు అందరికీ చేరువకాకపోవడంతో 'గరీబీ హఠావో’ కేవలం నినాదంగా మిగిలిపోయిందని ప్రతిపక్షాలను విమర్శించారు. తమ పాలనలో చిట్టచివరి వ్యక్తికీ అభివృద్ధి ఫలాలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.