19-01-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జనవరి 19: లోక్ సభ నుంచి బహిష్కరణకు గురైన తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మహువా మొయిత్రా ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయక తప్పలేదు. ఎంపీగా ఉన్నప్పుడు దిల్లీలో ఆమెకు కేటాయించిన ప్రభుత్వ భవనాన్ని ఖాళీ చేయాలంటూ అధికారులు జారీచేసిన నోటీసుపై స్టే ఇచ్చేందుకు దిల్లీ హైకోర్టు గురువారం నిరాకరించింది. ఈ క్రమంలోనే శుక్రవారం డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ విభాగ అధికారులు ఆమె ఇంటికి వెళ్లారు.
అయితే అప్పటికే నివాసాన్ని ఖాళీ చేసినట్లు ఆమె న్యాయవాది వెల్లడించారు. డిసెంబరు 8న మొయిత్రా లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 7వ తేదీ లోగా ఆమెకు కేటాయించిన అధికార నివాసాన్ని ఖాళీ చేయాలంటూ గతంలో నోటీసులు ఇచ్చారు. దీనిపై ఆమె దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆ పిటిషన్ను కోర్టు తిరస్కరించడంతో డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ చర్యలు చేపట్టింది. ఈ ఉదయం అధికారుల బృందం మహువాకు కేటాయించిన టెలిగ్రాఫ్ లేన్లోని 9బీ నివాసానికి చేరుకుంది.
అయితే, అధికారులు రావడానికి ముందే మహువా మొయిత్రా బంగ్లాను ఖాళీ చేసినట్లు న్యాయవాది షాదాన్ ఫరాసెత్ తెలిపారు. ఎలాంటి బలవంతపు చర్యలు చోటుచేసుకోలేదని, ఇంటి తాళాలను డీవోఈ అధికారులకు అప్పగించామని పేర్కొన్నారు. లోక్ సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరానందాని నుంచి మొయిత్రా డబ్బులు, ఖరీదైన కానుకలు తీసుకున్నారని, పార్లమెంట్ లాగిన్ను దుబాయ్ నుంచి యాక్సెస్ చేశారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
దీనిపై దర్యాప్తు చేపట్టిన ఎథిక్స్ కమిటీ.. మహువా అనైతిక ప్రవర్తన, సభా ధిక్కరణకు పాల్పడ్డారని పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా తన పార్లమెంట్ లాగిన్ వివరాలను బయటి వ్యక్తులకు ఇచ్చినట్లు తేల్చింది. ఈ నివేదికకు లోక్సభ ఆమోదం తెలిపింది. దాంతో ఆమె లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేసి.. సభ నుంచి బహిష్కరించారు.