19-01-2024 RJ
జాతీయం
ముంబై, జనవరి 19: అయోధ్యలో రామ మందిర్ ప్రాణప్రతిష్ట కార్యక్రమం జనవరి 22న జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అయోధ్యలోని బ్యాంకులు ఆ రోజున హాఫ్ డే మాత్రమే పనిచేస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలు దేశవ్యాప్తంగా ఆ రోజున మధ్యాహ్నం 2.30 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయని ప్రకటించారు.
ఈ క్రమంలోనే తాజాగా ప్రాణప్రతిష్ట కార్యక్రమం రోజున స్టాక్ మార్కెట్ సమయాల్లో కూడా మార్పులు చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. జనవరి 22న కరెన్సీ మార్కెట్లు ఉదయం 9 గంటలకు బదులు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. జనవరి 22న ప్రభుత్వం సగం రోజుల సెలవు ప్రకటించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఈ మార్పు ఫారెక్స్, బాండ్ మార్కెట్కు కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు సర్క్యూలర్ జారీ చేస్తూ ఆర్బీఐ వెల్లడించింది. జనవరి 22, 2024న అయోధ్యలో రాంలాలా ప్రాణ్ ప్రతిష్ఠా వేడుకను భారతదేశం అంతటా ఘనంగా జరుపుకునేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ వేడుకలో ఉద్యోగులు పాల్గొనేందుకు వీలుగా భారతదేశం అంతటా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర సంస్థలు, కేంద్ర పారిశ్రామిక సంస్థలు జనవరి 22, 2024 మధ్యాహ్నం 2:30 గంటల వరకు మూసివేయాలని నిర్ణయించారు.