20-01-2024 RJ
జాతీయం
రామో విగ్రహవాన్ ధర్మః.. అంటే మూర్తీభవించిన ధర్మస్వరూపుడు రామచంద్రుడు... రామయణం మొత్తం ధర్మపాలన, ధర్మబద్ధత గురించే చెబుతుంది. మనిషి నడవడిక మొదలు.. ఎవరు ఎలా నడచుకోవాలో చెబుతుంది. రామయణం రాసిన వాల్మీకి మహర్షి నిజంగా గొప్పవాడు. రాముడు నడయాడిన అయోధ్య ఇప్పుడు పావన అయోధ్యగా మారుతోంది.
ముష్కరుల దాడిలో భారీతీయ హైదంవాన్ని దెబ్బతీసినా.. శతాబ్దాలుగా చేస్తున్న పోరాటలకు చరమగీతం పడింది. జగదానంద కారకా.. జయ జానకి ప్రాణ నాయక ..శుభ స్వాగతం..ప్రియా పరిపాలక మంగళకరం నీరాక.. మా జీవనమే పావనమవుగాక.. అంటూ భక్తకోటి ఆశ్రీరాముడ్ని తలచుకుని పాడుతోంది.
భవ్యరామమందిరంలో మన రామయ్య కొలువయ్యేనాటికి ఎన్నో అద్భుతాలు సాత్కారించబోతున్నాయి. ఆ అద్భుత మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరి ఘనతా ఉంది. అది ఓ ఆలయానికి సంబంధించిన గట్టం కాదు. మన తరతరాల సంస్కృతికి, వారసత్వ సంపదకు చిహ్నం. దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. మనమంతా వెలుగుదివ్వెల్లా ముందుకు సాగాల్సిన సమయమిది. అయోద్యలో భవ్యమందిర నిర్మాణం జరిగింది. 22న మనమంతా ఎదురు చూస్తున్న మహాక్రతువు ప్రారంభం కానుంది.
మన ధర్మాన్ని మనం నిలబెట్టుకుని సగర్వంగా ఆచరించే శుభ ఘడియగా దీనిని భావించాలి. ఇక్కడ తర్కాలకు, విమర్శలకు తావు లేదు. అయోధ్య ముహూర్తం సరైనదా కాదా అన్న వివాదాలకు సమయం కాదిది. ఎవరు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారన్న రాజకీయాలకు వేదిక కాదు. భారీతీయులు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హైందవులంతా ఒక్కటై పిక్కటిల్లేలా రాముడికి వందనం చేయాల్సిన సమయమిది. ధర్మాన్ని కాపాడుతామని ప్రతిన చేయాల్సి సమయమిది. ఇక్కడ పండిత విమర్వలకు, రాజకీయ కుసంస్కారాలకు ఆస్కారం లేదు.
శతాబ్దాల కింద ముష్కరుల దాడిలో ధ్వంసమైన హైందవాన్ని పునరుద్దరించుకునే సమయం మాత్రమే. దీనికి • మీనమేషాలు లెక్కించాల్సిన అవసరం లేదు. నిత్యం మనమంతా ఉదయం కోసం ఎదురు చూస్తాం. ఎదురు చూడాలి. ఈరోజుకంటే రేపు గొప్పది... ఎదురు చూడటంలో నమ్మకం ఉంది. ఆశ ఉంది. మనోబలం ఉంది. శ్రద్ధ ఉంది. ఇష్టం ఉంది. అపారమైన ప్రేమ ఉంది. బతకాలన్న కోరిక మెండుగా ఉంది. వసంతం కోసం కోయిల, కోయిల కోసం వసంతం ఎదురు చూస్తాయి. ఎంతో కష్టపడి తాను పోగుచేసిన తేనెను, మనిషి కోసం తేనెటీగ త్యాగం చేస్తుంది.
ఆ సహజత్వంలో అపారమైన ప్రకృతి ప్రేమ ఉంది. కారణజన్ములను కన్న తల్లులు కూడా తొమ్మిది నెలలు తమ గర్భంలో మోసి వారి రాకకోసం ఎదురుచూస్తారు. ఈ రోజు' వెళ్లిపోతుంది. 'రేపు' చిరునవ్వులతో మనముందు సాక్షాత్కరిస్తుంది. కొత్త ఆశలు రెక్కలు తొడుక్కుని వస్తాయి. కొత్త చిగుళ్లతో చెట్లు ముస్తాబవుతాయి. కొత్త సూర్యుడు బంగారు పూలరథంమీద వస్తాడు. భవిష్యత్తులో జరగబోయే అద్భుతాల కోసం మనమంతా విధిగా ఎదురుచూడాలి. ఎందుకంటే రామాయణంలో గుహుడు ఎదురుచూశాడు. శబరి అలాగే ఎదురుచూసింది. కౌసల్య ఎదురు చూసింది.
దశరథుడు ఎదురుచూశాడు. అయోధ్య ఎదురుచూసింది కూడా శ్రీరాముడి జననం కోసం. అలాగే ఇప్పుడంతా ప్రపంచమంతా అయోధ్య రాముడి ఆలయం కోసం ఎదురు చూస్తోంది. శతాబ్దాల స్వప్నం సాకారం అయ్యే ఘడియలు సమీపిస్తున్నాయి. ప్రపంచంలోని ప్రముఖులంతా హాజరుకాబోతున్న ఈ మహా సంబురం వేళ అయోధ్య సరికొత్తగా తనను తాను ఆవిష్కరించుకుంటోంది. విశ్వ ఆధ్యాత్మిక నగరిగా విరాజిల్లుతున్న అయోధ్యలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక పరిమళాలతో విరాజిల్లబోతోంది.
లక్షలమంది హాజరయ్యే భవ్య రామమందిర మహా సంరంభ వేడుకకు నభూతో నభవిష్యత్ అన్నరీతిలో ఏర్పాట్లు జరిగాయి. ఈ మహాత్కార్యంలో తామూ భాగస్వాములయ్యేందుకు భక్తజనం ఉవ్విళ్లూరుతోంది. 22న రామ్లల్లా విగ్రహా ప్రతిష్టాపన.. భవ్య కార్యక్రమానికి దివ్య ముహూర్తం నిర్ణయమైంది. ఆ రోజు మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల 29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల ౩౦ నిమిషాల 32 సెకన్ల శుభ ముహుర్తాన విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. అంటే శతాబ్దాల యావత్ హిందువుల కల 84 సెకన్లలో పరిపూర్ణమవుతుంది.
మేషలగ్నంలో అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగ నుంది. ఆ పవిత్ర సమయంలో గురు ఉచ్చస్థితి ఉండవల్ల రాజయోగం కలుగుతుంది. సాధారంగా 5 గ్రహాలు అనుకూలంగా ఉంటే అది అత్యంత శుభముహుర్తంగా పరిగణిస్తారు. రామ్లల్లా ప్రాణప్రతిష్ట సమయంలో ఆరు గ్రహాలు అనుకూలంగా ఉండడం మరో విశేషం. భూకంపాలు.. సునామీ.. ఎలాంటి ప్రళయాలు వచ్చినా సరే.. అయోధ్య ఠీవీ ఇసుమంత కూడా చెక్కు చెదరకుండా అయోధ్య భవ్య రామమందిరం నిర్మాణం సాగింది.
ఈ అర్కిటెక్చర్ను చూసి ప్రపంచం అబ్బురపడుతోంది. ఇక కొందరిలో మరో శంక కలుగుతోంది. దీనిపైనా రాజకీయాలు నడుస్తున్నాయి. విగ్రహ ప్రతిష్టాపన జరుగకుండానే... పూజలు చేయకుండానే అక్షతలు ఎలా వచ్చాయి అని చాలా మందికి సందేహం కలిగింది. చాలామంది ఇదే వారి సందేహమని అన్నారు. మనకు పంపిణీ చేస్తున్న అక్షింతలు విగ్రహ పూజకి సంబంధించినవి కావు. వాటిని అక్కడి పురోహితులు విజయ 'అక్షతలు' అని వర్ణించారు.
500 సంవత్సరాల పోరాటం తరువాత రాముని ఆలయ నిర్మాణానికి మనకు అవకాశం దక్కింది కనుక, ఆలయ నిర్మాణాన్ని విజయంగా భావించి, నిర్మాణం జరిగిన తరువాత, బాల రాముని సన్నిధిని కలిగిన ఆలయ ప్రాంగణంలో, విజయ అక్షతలను బియ్యమూ, పసుపూ ఆవునెయ్యిలతో వేద మంత్రోచ్ఛారణ చేస్తూ కలిపి ఇంటింటికీ పంపించాలని సంకల్పించారు. రాముడు వనవాసం తరువాత అయోధ్యకి తిరిగి వస్తుండగా అందరూ అక్షతలూ పూలూ చేతులలో పట్టుకుని ఆయన రాగానే వాటిని చల్లి.. ఆహ్వానం పలికారట.
అలాగే మరల అయోధ్య లో రాముని ప్రతిష్ఠ జరిగినప్పుడు ఆ ఆలయంలో ముందుగా తయారైన ఈ 'విజయ అక్షతలు' మనం ఇంట్లో పూజకు వాడి శిరస్సున ధరించా లని ఉద్దేశ్యం. అక్షయమైనవి అక్షింతలు. క్షయము లేనివి, రామ రాజ్యము అక్షయముగా ఉండాలని కోరుతూ మనందరం విగ్రహ ప్రతిష్ఠ రోజున అయోధ్య దగ్గరలో ఉండి అక్షతలు వేయలేకపోయినా ఇంట్లోనే ఉండి ఆలయ ప్రాంగణంలో తయారైన విజయ అక్షతలతో పూజ చేసుకుని వాటిని శిరస్సున ధరించవచ్చు. క్రింద పడితే తొక్కుతామనే సందేహం ఉంటే పూజలో వాడిన అక్షింతలని నైవేద్యం కోసం వాడుకోవచ్చు.
ఇకపోతే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో భాగంగా సంప్రోక్షణ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. గురువారం గర్భగుడి లోపల విగ్రహం ఉంచిన ఫొటోలు విడుదల కాగా.. ఆ విగ్రహం తలపై పసుపు గుడ్డ కప్పి ఉంచారు. ఈ విగ్రహం బాల రాముడి ముఖంతో పాటు బంగారు విల్లు, బాణాన్ని పట్టుకున్నట్లు చూపిస్తోంది.
ఐదు ఏళ్ల ప్రాయంలో రామచంద్రుడు బంగారు విల్లు, బాణం పట్టుకుని నిలబడి ఉన్న భంగిమలో దర్శనం ఇస్తున్నాడు. మొత్తంగా మనమంతా అయోధ్య సంకల్పంతో ముందుకు సాగాల్సిన సమయమిది. ధర్మరక్షణకు మనమంతా కట్టుబడి ఉంటామని ప్రతిన చేయాల్సిన తరుణమిది.