20-01-2024 RJ
జాతీయం
భోపాల్, జనవరి 20: అయోధ్యలో రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమం కోసం ఉజ్జయిని మహాకాళేశ్వర్ అలయంలో తయారు చేసిన 5 లక్షల లడ్డూలు అక్కడికి బయలుదేరాయి. ఈ లడ్డూలు తీసుకుని బయలు దేరిన అయిదు ట్రక్కులకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు. ఒక్కోటి 50 గ్రాముల బరువుండే ఈ లడ్డూలు మొత్తం 250 క్వింటాళ్ల బరువుంటాయని మహాకాళేశ్వర ఆలయ అధికారి ఒకరు చెప్పారు.
అంతకు ముందు ఉజ్జయిని నుంచి ఈ లడ్డూలను తీసుకుని వచ్చిన అయిదు ట్రక్కులు భోపాల్ కు చేరుకున్నాయి. అయిదు రోజుల పాటు 150 మంది ఆలయ సిబ్బందితో పాటుగా స్థానిక స్వచ్ఛంద సంస్థలకు చెందిన పలువురు ఈ లడ్డూల తయారీలో పాలు పంచుకున్నట్లు మహాకాళ్వేర్ ఆలయ అధికారి మూలచంద్ జున్వాల్ చెప్పారు. ఆలయానికి ప్రత్యేక విభాగం ఈ లడ్డూలను తయారు చేసినట్లు ఆయన చెప్పారు.