22-01-2024 RJ
జాతీయం
అయోధ్య, జనవరి 22: అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు తరలివచ్చారు. కార్యక్రమానికి శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు అందజేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇందులో పారిశ్రామికవేత్తలు సైతం ఉన్నారు. సోమవారం జరిగిన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు మెరిశారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ, ఆకాశ్ అంబానీ, అతని భార్య శ్లోకా మెహతా అంబానీ, అనిల్ అంబానీ సైతం హాజరయ్యారు. ముకేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ ఆమె భర్త ఆనంద్ పిరమల్తో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇషా మాట్లాడుతూ తమకు అత్యంత పవిత్రమైన రోజుల్లో ఇది ఒకటి అని, అయోధ్యకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
బిర్లా గ్రూప్ నకు చెందిన కుమార్ మంగళం బిర్లాతో పాటు అనన్య బిర్లా సైతం వేడుకకు హాజరయ్యారు. వేదాంత గ్రూపునకు చెందిన అనిల్ అగర్వాల్, రేమండ్ గ్రూప్ అధినేత అనిల్ సింఘానియా, భారతీ ఎంటర్ ప్రైజెస్ వ్యవస్థాపకుడు, చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ రామమందిరం ప్రాణ ప్రతిష్ఠలో పాల్గొన్నారు.