23-01-2024 RJ
జాతీయం
అయోధ్య, జనవరి 23: రామరాజ్య స్థాపనకు కంకణం కట్టుకున్న ప్రధాని నరేంద్రమోడీ.. అందుకు అనుగుణంగా అడుగులు వేయాల్సి ఉంది. మోడీ సమర్థత కారణంగానే అయోధ్య రామమందిర వివాదం సమసింది. దాదాపు 500 ఏళ్లనాటి సమస్యకు పరిష్కారం దక్కింది. ఈ వివాదంలో ఎందరో అసువులు బాసారు. ఇది రావణకాష్టం లా ఇలాగే ఉంటుందా అన్న భయాలు ఉండేవి. అలాగే మోడీ సమర్థత కారణంగానే కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దయ్యింది. ఆయన సమర్థత కారణంగానే పలు సమస్యలు పరిష్కారం అవుతున్నాయి.
ఈ క్రమంలో ఇక సామాన్యుల బతుకులు బాగుపడేలా చర్యలకు పూనుకోవాల్సి ఉంది. ఇవే ఇప్పుడున్న ప్రధాన సవాళ్లుగా గుర్తించాలి. క్షేత్రస్థాయిలో ప్రజలను కలుసుకుంటేనే ఈ సమస్యలు అర్థం అవుతాయి. ప్రధానంగా ఆహార ధాన్యాల ధరలను అదుపు చేయడం, పెట్రో ధరలను జిఎస్టీ పరిధిలోకి తీసుకుని రావాల్సి ఉంది. ఎందుకంటే ఏకీకృతపన్ను విధానం గురించి చెబుతున్న మోడీ ఇక్కడ మాత్రం ఇంకా వ్యాట్ అమలు చేయడం సరికాదు. అలాగే జిఎస్టీతో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రధానంగా జిఎస్టీని వ్యాపారులు కట్టే పన్నుగా చూడరాదు. ఇది నేరుగా ప్రజలపై భారం పడుతోంది.
దీంతో బంగారం కొనేవాళ్లకు, ఇళ్లు కొందామను కున్న వారికి, ఇన్సూరెన్స్ తీసుకుంటున్న సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతు న్నారు. మోయలేనంతగా పన్నుల భారం ప్రజల నడ్డి విరుస్తోంది. ఇన్కమ్ టాక్స్ కూడా వెసలుబాటు చూడాలి. నెలకు లక్షా 70 వేల కోట్ల ఆదాయం జిఎస్టీ ద్వారా వస్తుందని అనుకోవడం సరికాదు. హేతు బద్దీకరణ చేస్తే 2 లక్షల కోట్లు కూడా రాబట్టవచ్చు. ఈ క్రమంలో ఎన్నికలకు వెళుతున్న వేళ సామాన్యుల గుండె చప్పుడు వినాలి. సామాన్యుల మన్కీ బాత్ వింటేనే సమస్యలు తెలుస్తాయి. ఢిల్లీలో అధికారులతో కూర్చుంటే సమస్యలు అర్థం కావు.
జిఎస్టీ గురించి చర్చ పెట్టాలి. మరో వారం రోజుల్లో పార్లమెంట్ ముందుకు బడ్జెట్ ప్రతిపాదనలు రానున్నాయి. ఎన్నికల ముందు ఓటాన్ అకౌంట్కు వెళతారు. ఇప్పటికే ఏ రంగానికి ఎంత కేటాయింపులో నిర్ణయించి ఉంటారు. అయితే ఎన్నికల కు ముందు అన్న ధోరణి చాలాకాలంగా నడుస్తోంది. అలా కాకుండా దేశంలో ప్రజలు తమ బతుకులు తాము బతికేలా చూడాల్సిన అవసరం ఉంది. పెట్రో, గ్యాస్, ఇంటి కొనుగోళ్లు, ఉద్యోగాలకు అవసరమైన అవకాశాలు రావాలి.
కేంద్రంలో ఉన్న బిజెపి కావచ్చు.. రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు కావచ్చు... ప్రజలను దృష్టిలో పెట్టుకుని, వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగడం లేదు. ఉన్న దాంట్లో సర్దుకుని బతుకుదామనుకున్న ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. పన్నుల భారంతో ప్రజల నడ్డి విరుగుతోంది. భవిష్యత్తు మీద, దేశ ప్రజల మీద ఆలోచనలు లేని ప్రభుత్వాలు ప్రజల మీద స్వారీ చేస్తున్నాయి. కరోనాతో పూర్తిగా దివాళా తీసిన ప్రజలపై ధరలతో దాడులు చేస్తున్నారు.
వారి నడ్డివిరిగి లేవలేని విధంగా మోదుతున్నారు. అధికార దండం ఉందికదా అన్న రీతిలో పాలకుల తీరు ఉంది. సామాన్యుడు బతకడమెలా అన్నది ప్రభుత్వాలు ఆలోచించడం లేదు. ఏం చేస్తే బాగుపడతారు..ఎలా చేస్తే ఉపాధి దొరుకుతుంది..ఏ పథకాల వల్ల నిరుద్యోగం పోతుంది.. ఏం చేస్తే రైతులు బతుకుతారు.. నిరుద్యోగులకు ఉపాధి లేదా .. ఉద్యోగం కల్పించడం ఎలా అన్నఆలోచనలను పాలకులు విస్మరించారు. తాము చేసేదే గొప్ప అన్న రీతిలో పాలకలు ముందుకు సాగుతున్నారు.
దేశంలో ఇంధన ధరలు చూస్తుంటే పాలకుల నిర్లక్ష్యానికి ప్రజలు బలవుతున్నారు. డబ్బు సంపాదనే ధ్యేయంగా కేంద్రం సామాన్యుల గురించి మాట్లాడడం లేదు. చాయ్ వాలానని ఘనంగా చెప్పు కుంటున్న ప్రధాని మోడీ గతంలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా.. రెండు సార్లు ప్రధానమంత్రిగా వెలుగొందుతున్నా.. సామాన్యుల నాడి పట్టడంలో విఫలమయ్యారు. అయోధ్య ప్రారంభోత్సవంలో రామరాజ్యం గురించి ప్రస్తావించారు కనుక.. ఇప్పటికైనా ప్రజల మన్కీ బాత్ అర్థం చేసుకోవాలి.
జిఎస్టీ పేరుతో లక్షల కోట్లు వసూలు చేయడం పరమావధిగా బిజెపి ప్రభుత్వం సాగుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలతో ఓరకంగా చెప్పాలంటే సర్కార్ వ్యాపారం చేస్తుందనే చెప్పాలి. ఇబ్బడిముబ్బడిగా పన్నులు పెంచుతూ దానిని ప్రజలకు అందకుండా చేస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే సరుకు రవాణా భారం పెరిగి వివిధ రకాల వస్తువులపైనా ధరల మోత మోగుతుందన్న ఆలోచన చేయడం లేదు. పెట్రోల్ అన్నది సామాన్యుని వస్తువు. కార్లు, టూ వీలర్లు ఇప్పుడు సామాన్యుల కోసం మాత్రమే అని గుర్తించాలి.
రవాణా కోసం వారు వీటిని ఉపయోగించక తప్పడం లేదు. మనదేశంలో సరైన ప్రజారవాణా లేకపోవడం వల్ల సామాన్యులు సైతం టూ వీలర్లను, కార్లను ఉపయోగిస్తున్నారు. ఇంధన ధరలు మండిపోతుండటంతో వినియోగ దారులపై భారాన్ని తగ్గించేం దుకు సుంకాన్ని తగ్గించాల్సి కేంద్రం, రాష్ట్రాలు దాని గురించి ఆలోచించడం లేదు. ఇప్పటికే ధరలమోత, పెరుగుతున్న ద్రవ్యోల్బణం మద్య దేశంలో వంటగ్యాస్ భారం కూడా సామాన్యులపై పడింది. భారత్ ను ఏళ్లుగా నిరుద్యోగ సమస్య వెంటాడుతోంది.
ఎప్పుడూ లేనంతగా నిరుద్యోగం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. తక్షణమే ఉద్యోగాల కల్పనకు పెద్దపీట వేయాల్సిన పరిస్థితులు నెలకొన్నా.. వాటిని విస్మరించారు. ఇందుకోసం మౌలిక సదుపాయాల కల్పన, తయారీ రంగం, రియల్ ఎస్టేట్ రంగాలకు కేంద్రం విరివిగా ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం తప్పులు సరిదిద్దుకుని ముందుకు సాగాలి. అందుకు బడ్జెట్ సమావేశాల్లో ప్రణాళిక సాగాలి. బడ్జెట్ ద్వారా ప్రజల కష్టాలకు చెక్ పడాలి. ఉన్న ఆదాయవనరులను పేదలకు ఉపయోగపడేలా, సామాన్యులకు ఊరడింపు కలిగేలా చర్చలు చేయాలి. బడ్జెట్ అన్నది ఏటా జరిగే ఓ తంతుగా మారరాదు.
ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగాలి. ఎన్నికలు వస్తున్న తరుణంలో మోడీ ప్రభుత్వం మరోమారు ఫిబ్రవరి 1న బడ్జెట్ను ప్రవేశ పెట్టబోతున్నది. ప్రజలంతా నిస్సత్తువగా ఆశగా చూస్తున్న వేళ బడ్జెట్ పై ఆశలు కలిగించాలి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక వ్యవస్థ ఉత్తేజానికి చర్యలు చేపడుతూనే దీర్ఘకాలంగా ఉన్న నిరుద్యోగం, ఆరోగ్య సంరక్షణ వంటి వాటిపై దృష్టి సారించాల్సి ఉంది.