23-01-2024 RJ
జాతీయం
గౌహతి, జనవరి 23: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో జరుగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రను అస్సాం పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు గువాహటి నగరంలోకి ప్రవేశించకుండా సరిహద్దుల వద్ద బారికేడ్లను ఏర్పాటుచేశారు. అయినప్పటికీ దూసుకురావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సోమవారం మధ్యాహ్నం తర్వాత రాహుల్ యాత్ర అస్సాం నుంచి నాగాలాండ్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.
తిరిగి మంగళవారం ఉదయం ఇరు రాష్ట్రాల సరిహద్దుకు చేరుకున్న రాహుల్.. స్థానిక యువతతో సంభాషించారు. అక్కడి నుంచి గువాహటి నగరానికి బయల్దేరారు. అయితే, కాంగ్రెస్ పార్టీ తమ యాత్ర మార్గాన్ని మార్చు కోవాలని అంతకుముందు అస్సాం ప్రభుత్వం ఆదేశించింది. ట్రాఫిక్ కారణాల దృష్ట్యా గువాహటిలో యాత్రకు అనుమతించడం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఉదయం వెల్లడించారు. నగర బైపాస్ మీదుగా వెళ్లాలని సూచించారు. కానీ, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున గువాహటి చేరుకున్నారు.
దీంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బారికేడ్లను దాటుకుని కార్యకర్తలు దూసుకొస్తుండగా పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో రాహుల్ గాంధీ అక్కడే ఉన్నారు. ఈ ఉద్రిక్తతలపై రాహుల్ మాట్లాడుతూ.. ఇదే మార్గంలో బజరంగ్ దళ్ యాత్ర చేపట్టింది. భాజపా చీఫ్ నడ్డాజీ ర్యాలీ నిర్వహించారు. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాలేదు. ఇప్పుడు మాత్రం మాకు బారికేడ్లు పెట్టారు. మేం వాటిని మాత్రమే దాటాం.
చట్టాన్ని అతిక్రమించలేదని అన్నారు. దీనిపై అస్సాం సీఎం హిమంత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ పై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. ఇది మా సంస్కృతి కాదు. మాది శాంతియుత రాష్ట్రం. ఇలాంటి నక్సలైట్ వ్యూహాలకు మేం వ్యతిరేకం. ఘర్షణలు జరిగేలా కార్యకర్తలను రెచ్చగొట్టినందుకు గానూ రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించా.
కాంగ్రెస్ తమ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వీడియోలనే సాక్ష్యాలుగా పరిగణించాలని చెప్పా అని సీఎం వెల్లడించారు. సోమవారం కూడా రాహుల్ యాత్ర సందర్భంగా అస్సాంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ప్రముఖ వైష్ణవ సాధువు శ్రీమంత్ శంకర్దేవ జన్మస్థలి బతద్రవ సత్రను దర్శించుకోకుండా రాహుల్ను అడ్డుకున్నారు. దీనిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, మేఘాలయలో యూనివర్సిటీ విద్యార్థులతో రాహుల్ ఇష్టాగోష్ఠికి స్థానిక అధికారులు అనుమతులు ఇవ్వలేదు.
అసోం సీఎం హిమంత బిశ్వ శర్మపై రాహుల్ గాంధీ మరోసారి ఫైర్ అయ్యారు. తానంటే హిమంత బిశ్వ శర్మకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. అసోం సీఎం హిమంత బిశ్వ ర్మ దేశంలోనే అత్యంత అవినీతిపరులైన ముఖ్యమంత్రులలో ఒకరని కాంగ్రెస్ అధినేత రాహుల్గాంధీ అన్నారు. తన యాత్రకు బీజేపీ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందన్నారు. తనను ఎంత ఇబ్బంది పెడితే అంత మంచి జరుగుతుందన్నారు.
తనను కావాలనే కాలేజీలోకి వెళ్లకుండా అడ్డుకున్నారని అన్నారు. బీజేపీ తీరును యావత్ దేశం గమనిస్తోందన్నారు. మంగళవారం రాజధాని గౌహతి సమీపంలోని ఖానాపరాలో భారత్ జోడో యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు కాంగ్రెస్ శ్రేణులపై లాఠీ చార్చ్ చేశారు. వర్శిటీ బయటే మాట్లాడిన రాహుల్ తాను విద్యార్థులను కలిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందులేంటని ప్రశ్నించారు.