25-01-2024
జాతీయం
న్యూఢిల్లీ, జనవరి 25: ఏటా జాతీయ ఓటరు దినోత్సవం జరుపుకుంటున్న వేళ ఓటర్ల సవరణపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన నిర్నయాలు తీసుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకు వచ్చిన ఆరోపణలను గమనించి సంస్కరణలకు శ్రీకారం చుట్టాలి. ఓటర్ల తొలగింపు ఇప్పుడు పెద్ద సమస్యగా పరిణమించింది. దీనిని ఏ విధంగా చక్కదిద్దుతారో తెలియడం లేదు. ఓటరు ఐడి కార్డు పట్టుకుని వెళితే జాబితాలో పేర్లు ఉండడం లేదు. దీనికి పక్కా విధానం అమలు కావాల్సి ఉంది. దొంగ ఓట్ల విషయంలో కూడా ఇసి సరైన చర్యలు తీసుకోవడం లేదు.
ఓట్ల నమోదులో కొన్ని రాజకీయ పక్షాలు అదే పని మీద ఉంటాయి. అధికార పార్టీ నేతలు బోగస్ ఓట్లను చేర్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు అన్నచోట్లా వున్నాయి. సర్వేల పేరిట జరుగుతున్న తతంగం కూడా అధికార పార్టీ నేతల పర్యవేక్షణలోనే సాగుతోందని ప్రతిపక్షాలు అంటున్నాయి. రెవెన్యూ అధికారులు ఎటువంటి విచారణ లేకుండానే బోగస్ ఓటర్లను నమోదు చేసుకుంటున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. దొంగ ఓట్లు ఫలానా ప్రాంతంలో ఉన్నాయనీ, దర్యాప్తు జరిపించి నిజం నిగ్గు తేల్చాలనీ ఎన్నికల ప్రధానాధికారి జిల్లా ఎన్నికల అధికారిని ఆదేశిస్తే చక్కదిద్దు తారన్న భరోసా లేదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఇసి సక్రమంగా ముందుకు వెళ్లగలదు.
అధికారుల పరిశీలనలో దొంగ ఓట్లు నమోదైనట్టు రుజువైతే తప్ప చర్యలకు ఉపక్రమించడం లేదు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా నామినేషన్ వేయడానికి గడువు ముగిసే క్షణం వరకూ కొత్త ఓట్లను చేర్చుకునే పక్రియ కొనసాగుతోంది. ఇకపోతే రాజకీయ పార్టీల ప్రమేయంతో ఓట్ల తొలగింపు జరుగుతోందన్న వాదన ఉంది. దీనిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. దొంగ ఓట్లను తొలగించాలనే పట్టుదల కేంద్ర ఎన్నికల కమిషను నిజంగా ఉంటే అందుకోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి.
అంకిత భావంతో పనిచేసే సిబ్బందిని తగినంతగా సమకూర్చాలని రాష్ట్రపతిని అభ్యర్థించాలి. నామినేషన్ల గడువు ముగియడానికి ముందు ఉన్న ఓట్లకు పదిహేను లేదా ఇరవై శాతం కొత్త ఓట్లు నమోదు చేస్తున్నారు. నామినేషన్లు ముగిసిన తర్వాత దొంగ ఓట్లను గుర్తించి, తొలగించడానికి తగిన సమయం ఉండటం లేదు. అక్రమాలు జరిగినట్టు తెలుసుకొని ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత అధికారులపైన ఎటువంటి చర్య తీసుకున్నా లాభం ఉండదు.
చీఫ్ ఎలక్షన్ కమిషనర్లకు మంచి పేరు ఉన్నప్పటికీ ఎన్నికలలో ధన ప్రభావం విపరీతంగా పెరిగింది. అక్రమాలకు అంతులేకుండా పోతున్నది. అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం యథావిధిగా జరుగుతోంది. గతానుభవాను దృష్టిలో పెట్టుకుని పక్కాగా ఓటరు నమోదు కార్యక్రమం ఉండాలి. అవసరమైతే సాంకేతి కతను మరింతగా ఉపయోగించు కోవాలి. ఎన్నికలలో అవకతవకలకు పాల్పడిన అధికారులు ఎంతవారైనా వారిపైన చర్యలు తప్పవన్న హెచ్చరికలు కఠినంగా అమలు కావాలి. అప్పుడే భయం ఏర్పడుతుంది. అందుకు ఎన్నికల సంఘం ముందుకు వస్తుందా అన్నది చూడాలి. తాజాగా ఓటరు నమోదు బిల్లు చట్టరూపంలో రానుండడంతో ఇక అలాంటి ఎత్తులు పనిచేయకపోవచ్చు.
ప్రజలకు మేలు చేసే విషయాల్లో గుడ్డిగా వ్యతిరేకించడం తగదన్న విషయాన్ని విపక్షాలు గుర్తిస్తే మంచిది. ఆధార్-ఓటర్ గుర్తింపు కార్డుల అనుసంధానానికి అనుమతిస్తే దేశ పౌరులు కానివారు ఓటేసేందుకు అవకాశం ఉండబోదు. ఆధార్లో ఇక బోగస్ లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. ఓటర్ల జాబితాను సరి చూసు కొనేందుకు, వేర్వేరు నియోజకవర్గాల్లో ఓటరుగా నమోదైతే గుర్తించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఓటరుగా నమోదైన వారి పేరును ఓటర్ల జాబితా నుంచి తొలగించకుండా కూడా ఏర్పాట్లు చేశారు.
నిజానికి 2015లోనే ప్రభుత్వం బోగస్ ఓట్లను ఏరివేసేందుకు ఆధార్-ఓటర్ ఐడీ అనుసంధాన కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనికి చట్టబద్ధత లేదని సుప్రీంకోర్టు కొట్టేయడంతో నిలిపేసింది. ఆధార్ తో ఓటర్ ఐడీ అనుసంధానం ద్వారా దాన్ని పరిష్కరించడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే ఆధానర్ కార్డు లాగానే ఓటరు ఐడికి కూడా పర్మినెంట్ నంబర్ ఉంటే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఓటును కోల్పోవడం లేదా.. బోగస్ ను నివారించవచ్చని అంటున్నారు.
ఓటరు దినోత్సవం జరుపుకుంటున్న వేళ కఠిన సంస్కరణలతో ఎన్నికల సంఘం ముందుకు సాగాల్సి ఉంది. ఓటరు నమోదు, తొలగింపు ప్రమసనంగా కాకుండా పక్కాగా జరగాలి. ఈ మేరకు మేధావులు, నిపుణుల సూచనలతో ఆధునిక సాంకతికతతో ముందుకు సాగాల్సి ఉంది.