25-01-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జనవరి 25: 'ఇండియా' కూటమి నుంచి ప్రతిపక్ష పార్టీ నేతలు ఒక్కొక్కరుగా దూరమవుతున్న క్రమంలో రాహుల్ గాంధీ తన యాత్రను వాయిదా వేసుకుని అర్ధాంతరంగా ఢిల్లీకి బయలుదేరారు. కాంగ్రెస్ తో పొత్తు ఉండదని టీఎంసీ, ఆప్ లు ఇప్పటికే ప్రకటించాయి. జేడీయూ అధ్యక్షుడు, బిహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా భాజపాతో కలిసి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రకు రెండు రోజులు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
గురువారం ఉదయం అస్సాం నుంచి పశ్చిమ బెంగాల్లోని కూచెహర్ జిల్లాలోకి యాత్ర ప్రవేశించింది. ఇక్కడ రోడ్ షో నిర్వహించిన అనంతరం ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి వెళ్లారు. రెండు రోజుల తర్వాత జనవరి 28 నుంచి యాత్ర తిరిగి ప్రారంభమవుతుందని కాంగ్రెస్ తెలిపింది. ఇండియా కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన నీతీశ్ కుమార్ తిరిగి భాజపా వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భాజపా, జేడీయూ నేతలు ఒకే విమానంలో పట్నా నుంచి దిల్లీకి వెళ్లినట్లు సమాచారం.
రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నీతీశ్ ను శాంతింపజేసేందుకు ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన్ ను ఫోన్ లో సంప్రదించినట్లు తెలుస్తోంది. మరోవైపు లాలూ కూడా పార్టీ ముఖ్య నేతలతో అత్యవసరంగా సమావేశమైనట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీంతో కూటమిని నీతీశ్ వీడితే మిగిలిన పార్టీలతో కలిసి అనుసరించాల్సిన కార్యాచరణపై పార్టీ ముఖ్య నేతలతో చర్చించేందుకు రాహుల్ దిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది.