26-01-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జనవరి 26: దేశ వ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మువ్వన్నెల జాతీయజెండా ఆవిష్కరించారు. కర్తవ్యపథ్ చేరుకున్న తర్వాత రాష్ట్రపతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. గౌరవ వందనాన్ని స్వీకరించారు. వేడుకలకి ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ హాజరయ్యారు. ముర్ముతో కలిసి మాక్రాన్ సంప్రదాయ గుర్రపు బగ్గీలో వేదిక వద్దకు వచ్చారు. దాదాపు 38 ఏళ్ల తరువాత గణతంత్ర వేడుకల్లో బగ్గీని వినియోగించారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ దంపతులు, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, నిర్మల సీతారామన్ తదితరులు హాజరయ్యారు.
గణతంత్ర వేడుకల్లో భాగంగా ఉదయాన్నే జాతీయ వార్ మెమోరియల్ను ప్రధాని సందర్శించి, నివాళులర్పించారు. తరువాత సైనికుల కవాతు, శకటాల ప్రదర్శన, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సుమారు 13,000 మంది అతిథులు ఈ వేడుకల్లో భాగస్వామ్యమయ్యారు. మొదటిసారి సుమారు 100 మంది మహిళా కళాకారులు భారతీయ సంగీత వాద్య పరికరాలైన శంఖం, నాదస్వరం, నగారాలను వినిపించారు. సంప్రదాయ బ్యాండ్ కు బదులుగా శంఖం, నాదస్వరం, నగారాతో ప్రదర్శన ఇచ్చారు. మొత్తం మహిళలతో కూడిన ట్రై సర్వీస్ బృందం కర్తవ్య మార్గ్ లో కవాతు చేయడం ఇదే మొదటిసారి. నారీ శక్తి పేరుతో మహిళా పైలెట్లు, సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్సెస్ (సిఎపిఎఫ్) మహిళా సిబ్బంది ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అనంతరం శకటాలను ప్రదర్శించారు.
కర్తవ్యపథ్ రాష్ట్రపతి ముర్ము, మాక్రాన్ కు ప్రధాని మోదీ స్వాగతం పలికారు. కర్తవ్యపథ్ భారతీయ కళాబృందాలు పరేడు ప్రారంభించగా.. 25 శకటాల ప్రదర్శన నిర్వహించాయి. అత్యాధునిక మిలటరీ టెక్నాలజీని భారత్ ప్రదర్శించింది. పరేడ్ లో ఫ్రాన్స్ సైనిక బలగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 20 భీష్మ యుద్ధట్యాంకులు, అధునాతన నాగ్ మిసైల్ సిస్టమ్, పినాక మల్టీ బ్యారెల్ సిస్టమ్ కలర్ ఫుల్ గా నిలిచింది. అడ్వాన్స్ డ్ రేడియో ఫ్రీన్వెన్సీ సిస్టమ్ ప్రదర్శించగా.. భారత సైనికశక్తిని మాక్రాన్ కు ప్రధాని మోదీ వివరించారు.
దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో గణతంత్ర వేడుకల పరేడ్ లో ఆంధ్రప్రదేశ్ శకటం అందరినీ దృష్టిని ఆకర్షించింది.. విద్యారంగంలో చేపట్టిన సంస్కరణలకు అద్దం పట్టేలా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఈ శకటాన్ని సిద్ధం చేసింది.. శకటంపై ప్రధానంగా తరగతి గదుల్లో డిజిటల్ క్లాస్ బోర్డులు, ల్యాప్ టాప్ లు, ట్యాబ్లను విద్యార్థులు వినియోగించే తీరును బొమ్మలుగా రూపొందించారు.. ఇక్కడ చదివిన పిల్లలు డాక్టర్లు, లాయర్లు, ఇంజినీర్లుగా మారినట్లు చూపించారు.. ఈ ఇతివృత్తంపై 55 సెకెన్ల థీమ్ సాంగ్ ను రూపొందించగా..శకటం అతిథుల ముందు సాగేటప్పుడు ఈ పాట ప్లే అయ్యింది.
ఇకపోతే భారత పార్లమెంట్ ఆవరణలో 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయ్. స్పీకర్ ఓం బిర్లా... జాతీయ జెండాను ఆవిష్కరించి... పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం, అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందించారు. రిపబ్లిక్ డే సందర్భంగా పంజాబ్ లోని వాఘా సరిహద్దుల్లో దేశం మీసం మెలేసింది. తమ శక్తిని చూడండంటూ భారత సైనికులు రోషం, పౌరుషం చూపించారు. పందెం పుంజుల్లా కవాతు చేశారు. ఈ సైనికులు చేసిన విన్యాసాలు శివ తాండవాన్ని తలపించాయ్. భారత సైనికుల శక్తిని కళ్లకు కట్టాయి.
ప్రతిరోజు వాఘాలో బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం జరుగుతుంది. కానీ గణతంత్ర దినోత్సవం రోజు జరిగే వేడుకలు మాత్రం చాలాచాలా స్పెషల్. ఇక్కడ జరిగే బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం చూడడానికి నిజంగా రెండు కళ్లు సరిపోవు. రెండు దేశాల సైనికులు ఎదురుపడి పరస్పరం సెల్యూట్ చేసుకోవడం చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. దేశం మొత్తం గణతంత్ర దినోత్సవ శోభతో కళకళలాడుతోంది. రాజధాని ఢిల్లీతోపాటు ప్రధాన నగరాలన్నీ విద్యుత్ కాంతుల్లో వెలిగిపోతున్నాయ్.