29-01-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జనవరి 29: రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది సభ్యుల ఎంపికకు ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుండగా.. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. అదే రోజున ఓట్ల లెక్కింపు ఉంటుంది. నామినేషన్ దాఖలుకు ఫిబ్రవరి 15 చివరి తేదీ, ఉపసంహరణకు చివరి తేదీ ఫిబ్రవరి 20. తెలంగాణలో మూడు, ఏపీలో మూడు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
రాజ్యసభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం నాడు షెడ్యూల్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఆరు స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు, తెలంగాణ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఏప్రిల్ నెలలో ముగియనుంది. రాజ్యసభ సభ్యుల నియామకం కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 8వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. రాజ్యసభ సభ్యుల ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది.
ఏప్రిల్ నెలఖారుకు 56 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగియనుంది. తెలుగురాష్ట్రాల్లో మొత్తం 6 స్థానాలు ఖాళీ అవుతుండగా.... తెలంగాణాలో 3 స్థానాలకు.. ఆంధ్రప్రదేశ్ లో 3 స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరుగనున్నాయి. అత్యధికంగా... ఉత్తరప్రదేశ్ లో 10 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ నుంచి రిటైర్ అవుతున్న రాజ్యసభ ఎంపీల్లో వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోష్ కుమార్ ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి రిటైర్ అవుతున్న ఎంపీల్లో సీఎం రమేష్, కనకమేడల రవీంద్ర కుమార్,. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు ఉన్నారు. యూపీలో అత్యధికంగా 10 మంది సభ్యులను ఎన్నుకోనున్నారు. ఆ తరవాత బిహార్, మహారాష్ట్రలో ఆరుగురు చొప్పున సభ్యుల ఎన్నిక జరగనుంది. ఇక పశ్చిమ బెంగాల్లో ఐదుగురు, మధ్యప్రదేశ్ లో ఐదుగురు, కర్ణాటకలో నలుగురు సభ్యులను ఈ ఎన్నికల ద్వారా ఎన్నుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, రాజస్థాన్ లో మూడు సీట్లున్నాయి.
ఛత్తీస్గఢ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఒక్కో సీటికి ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 16వ తేదీన నామినేషన్లు పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 20 చివరి తేదీగా ఎన్నికల సంఘం వెల్లడించింది. ఫిబ్రవరి 27న సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ పక్రియ మొదలవుతుంది. రాజ్యసభ సభ్యుల్ని ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. బ్యాలెట్ పేపర్ విధానంలో ఈ ఎన్నిక జరుగుతుంది.
బ్యాలెట్ పేపర్ పై అభ్యర్థుల వివరాలుంటాయి. ఆ పేర్లలో తనకు నచ్చిన పేరుని మార్క్ చేసి బాక్స్ లో వేస్తారు ఎమ్మెల్యేలు. తొలిరౌండ్లో అవసరమైన మెజార్టీ సాధించిన వ్యక్తి గెలిచినట్టుగా ప్రకటిస్తారు. అందరికన్నా తక్కువ ఓట్లు వచ్చిన వాళ్లను తొలగిస్తారు. ఆ ఓట్లను ఎమ్మెల్యేల నిర్ణయం ప్రకారం మిగతా అభ్యర్థులకు బదిలీ చేస్తారు. అన్ని వేకెన్సీలు భర్తీ అయ్యేంత వరకూ ఈ పక్రియ కొనసాగుతుంది.