30-01-2024 RJ
జాతీయం
బెంగళూరు, జనవరి 30: త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత ప్రియాంక గాంధీ రాష్ట్రం నుంచి పోటీ చేస్తారని గత రెండురోజులుగా చర్చ జరుగుతోంది. ఢిల్లీ నుంచి బెంగళూరు దాకా ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే తెలంగాణ నుంచి సోనియాను పోటీ చేయించాలన్న చర్చ సాగుతోంది. లేదా ఆమెను రాజ్యసభకు పంపాలని అనుకుంటున్నారు. కర్నాటక, తెలంగాణల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడడంతో అగ్రనేతలను తమ రాష్ట్రాల్లో పోటీ చేయించాలన్న పోటీ పెరుగుతోంది.
రాహుల్ ఎలాగూ తిరిగి వయనాడ్ నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు. ఈ రెండు రాష్ట్రాలకు గాంధీ కుటుంబంతో దశాబ్దాలుగా ప్రత్యేక సంబంధాలు ఉన్నాయి. ఇందిరాగాంధీకి రాజకీయంగా పునర్జన్మ ఇక్కడి నుంచే సాధ్యమైంది. చిక్కమగళూరు నుంచి ఇందిరాగాంధీ విజయం సాధించగా 1999లో సోనియాగాంధీ బళ్లారి నుంచి పోటీ చేసి విజయం నమోదు చేశారు. మెదక్ నుంచి కూడా ఇందిర పోటీచేసి విజయం సాధించారు. అదే తరహాలోనే ప్రియాంకగాంధీని కూడా రాష్ట్రం నుంచి పోటీ చేయించాలని అధిష్టానం ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రియాంకగాంధీ పోటీపై రెండు వారాలలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రియాంక, సోనియాల కోసం ఈ రెండు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి.
ప్రియాంకగాంధీని కర్నాటక రాష్ట్రం నుంచి పోటీ చేయించడం ద్వారా ఎక్కువ స్థానాల్లో విజయం సాధించవచ్చునని రాష్ట్ర పార్టీ నేతలు ఆలోచనగా ఉన్నట్లు సమాచారం. అందుకే సురక్షితమైన నియోజకవర్గాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర నేతలకు సమాచారం లేకుండానే ఢిల్లీ ముఖ్యుల పర్యవేక్షణలోని బృందాలు కొప్పళ నియోజకవర్గంలో సర్వే జరిపినట్లు తెలిసింది. ప్రియాంకగాంధీని తెలంగాణ నుంచి కూడా పోటీ చేయించాలనే డిమాండ్ ఉంది.
ప్రస్తుతం దక్షిణాదిన రెండు రాష్ట్రాల్లో పటిష్టమైన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నందున ఇక్కడి నుంచే పోటీ చేయించాలని తద్వారా ఇక్కడ ఎక్కువ ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవాలని పార్టీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ప్రియాంకగాంధీని ఆహ్వానిస్తున్నారు. రాష్ట్రానికి చెందిన ముఖ్యనేతలకు సమగ్ర సమాచారం లేక పోవడంతో ఈ ప్రచారంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయడం లేదు.
బీజేపీకి చెందిన కొప్పళ లోక్ సభ సభ్యుడు కరడి సంగణకు సొంతపార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అతడికి కాకుండా మరెవరికైనా టికెట్ ఇవ్వాలని బహిరంగంగానే నియోజకవర్గానికి చెందిన ముఖ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్రను కలిసిన స్థానిక ముఖ్యులు మరోసారి సంగణకు టికెట్ ఇస్తే సహకరించేది లేదని తేల్చి చెప్పినట్లు సమాచారం.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటం, పైగా ఎన్నికలకు ముందు ప్రకటించిన ఐదు గ్యారెంటీలు అమలుచేస్తుండటంతో లోక్ సభ ఎన్నికలలోను గెలుపు సునాయాసమని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. కొప్పళ పరిధిలో 8 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా ఆరుచోట్ల కాంగ్రెస్ విజయం సాధించగా ఒక స్థానంలో గాలి జనార్దనరెడ్డి మరోస్థానంలో బీజేపీ విజయం సాధించాయి. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నందున విజయం సాధ్యమనే అంచనాలతోనే ప్రియాంకగాంధీని ఆహ్వానిస్తున్నట్లు సమాచారం.