01-02-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: బడ్జెట్ ప్రకటించే రోజు దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో ప్రతి ఏడాది ఈ ప్రత్యేకమైన రోజున ఆమె ధరించే చీరలపైనా అందరి దృష్టి ఉంటుంది. గురువారం నిర్మలా సీతారామన్ బడ్జెట్ ట్యాబ్ పట్టుకొని నీలంరంగు చీరలో కనిపించారు. ఈ టస్సార్ పట్టు చేనేత చీర.. గోధుమ రంగులో బెంగాలీ సంస్కృతిని ప్రతిబింబించే ఎంబ్రాయిడరీతో మెరిసిపోయింది. ఈ నీలివర్ణాన్ని తమిళనాడులో 'రామా బ్లూ' అని పిలుస్తారు. ఇటీవల అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠకు సంకేతంగా ఆమె ఈ రంగు చీరను ధరించారు. మొత్తంగా అటు బెంగాల్, ఇటు తమిళనాడు సంప్రదాయాలను కలగలిపిన చీరతో ఆమె మరోసారి ప్రత్యేకత చాటుకున్నారు.
ఆమె 2019లో ఆర్థికమంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గరి నుంచి ఈ రోజు వరకు చేనేత చీరే ధరిస్తున్నారు. వాటిపై తన ప్రేమను ఓ సందర్భంలో ప్రస్తావించారు కూడా. 'సిల్క్ కాటన్ ఏదైనా కానీ.. ఒడిశా చేనేత చీరలు నాకిష్టమైన వాటిలో ఒకటి. వాటి రంగు, నేత పని, ఆకృతి బాగుంటాయి' అని వెల్లడించారు. 2023లో బ్రౌన్ రంగులో టెంపుల్ బోర్డర్ లో ఉన్న ప్రకాశవంతమైన ఎరుపు చీరతో కనిపించారు. 2022లో మెరూన్ రంగు చీరను ధరించారు. ఇది కూడా ఒడిశాకు చెందిన చేనేత చీరే. ఆ రంగు దుస్తుల్లో ఆమె చాలా సాదాసీదాగా కనిపించారు. ఇది ఆమె నిరాడంబరతకు నిదర్శమని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. 2021లో ఎరుపు-గోధుమ రంగు కలగలిసిన భూదాన్ పోచంపల్లి చీరలో కనిపించారు. తెలంగాణకు చెందిన ఈ పోచంపల్లిని సిల్క్ సిటీ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు.
2020లో నీలం రంగు అంచులో పసుపుపచ్చ బంగారు వర్ణంలో ఉన్న చీర కట్టులో మెరిశారు. ఈ రంగు శ్రేయస్సు, సమృద్ధిని సూచిస్తుంది. అలాగే 'ఆస్పిరేషనల్ ఇండియా' థీమ్ కు అనుగుణంగా దీనిని ధరించారు. 2019లో మంగళగిరి గులాబీ రంగు చీర కట్టుకున్నారు.