01-02-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన చివరి బడ్జెట్ ప్రసంగాన్ని కేవలం గంటలోపే ముగించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ చివరి బడ్జెట్ ను గురువారం లోక్ సభలో ప్రవేశపెట్టారు. 58 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం కొనసాగించారు. ఇంతవరకూ ఆమె ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లతో పోల్చుకుంటే అత్యంత తక్కువ సమయంలో బడెట్ ప్రసంగం ముగించడం ఇదే ప్రథమం. నిర్మలా సీతారామన్ గత ప్రసంగాలను పరిశీలిస్తే, 2019లో 137 నిమిషాల పాటు ఆమె బడ్జెట్ ప్రసంగం సాగించారు.
2020లో 162 నిమిషాల పాటు సుదీర్ఘంగా ప్రసంగించారు. 2021లో 110 నిమిషాలు, 2022లో 92 నిమిషాలు ప్రసంగించారు. 2023లో 87 నిమిషాల పాటు ఆమె ప్రసంగం సాగింది. ఈ సారి తాత్కాలిక బడ్జెట్ కావడంతో 58 నిమిషాలతో ప్రసంగం ముగిసింది. 2019 జూలై నుంచి ఐదు సార్లు పూర్తి బ్జడెట్ ను నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్ తో గత ఆర్థిక మంత్రులు మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, పి. చిదంబరం, యశ్వంత్ సిన్హాల రికార్డులను ఆమె అధిగమించారు.