02-02-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: మనీలాండరింగ్ కేసులో తన అరెస్టును సవాలు చేసిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెను సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఆయన పిటిషన్ను కొట్టివేస్తూ శుక్రవారం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఈ అంశంలో తాము జోక్యం చేసుకోలేమని, హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. మనీలాండరింగ్ కేసులో ఈడీ శుక్రవారం మధ్యాహ్నం ఆయన్ని అరెస్ట్ చేసింది. జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ అధికార దుర్వినియోగానికి పాల్పడి రూ.600 కోట్ల భూకుంభకోణానికి పాల్పడి అక్రమంగా సంపాదించిన డబ్బును విదేశాలకు తరలించినట్లు ఈడీ ఆరోపించింది.
ఈ క్రమంలో ఆయనపై కేసు నమోదు చేసింది. అరెస్టు తప్పదని తేలడంతో రాజ్ భవన్ లో ఆయన రెండు రోజుల క్రితం రాజీనామా చేశారు. అక్కడే ఉన్న ఈడీ అధికారులు ఆయన్ని అరెస్టు చేశారు. తొలుత హైకోర్టును ఆశ్రయించిన హేమంత్.. తరువాత పిటిషన్ని వెనక్కి తీసుకుని సుప్రీం తలుపు తట్టారు. ఆయన పిటిషన్ పై విచారించిన కోర్టు.. తీర్పు వెలువరించింది. ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. దీంతో సోరెను గట్టి ఎదురు దెబ్బ తగిలినటైంది. ఇప్పటికే జేఎంఎం, కాంగ్రెస్ కు చెందిన 43 మంది ఎమ్మెల్యేలు తమ తదుపరి సీఎంగా మంత్రి చంపయి సోరెను మద్దతు తెలిపారు. శుక్రవారం గవర్నర్ సమక్షంలో సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.