02-02-2024 RJ
జాతీయం
రాంచీ, ఫిబ్రవరి 2: జార్ఖండ్ లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంపాయ్ సోరెన్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. రాంచీలోని రాజ్భవన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ సిపి. రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణం చేయించారు. కాంగ్రెస్ నేత అలంగీర్ ఆలం, ఆర్జేడి ఎమ్మెల్యే సత్యానంద్ భోక్తాలు మంత్రులుగా ప్రమాణం చేశారు. మనీలాండరింగ్ ఆరోపణలతో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను ఈడి బుధవారం రాత్రి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
దీంతో 24 గంటలకుపైగా రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొంది. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై కొన్ని గంటల పాటు సందిగ్ధత నెలకొంది. చివరకు గురువారం అర్థరాత్రి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆమోదించారు. హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రవాణా మంత్రిగా పనిచేసిన చంపాయ్ సోరెన్ శుక్రవారం నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే పదిరోజుల అనంతరం నిర్వహించే బల పరీక్షలో తన మెజారిటీని నిరూపించుకోవాల్సి వుంది.
చంపాయ్ సోరెన్ కు జార్ఖండమ్ముక్తి మోర్చా కాంగ్రెస్ - రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడి) కూటమికి చెందిన 43 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా ఉన్నారు. వీరిలో ఇద్దరు చంపాల్ తో పాటు నేడు ప్రమాణం చేశారు. 43 మంది ఎమ్మెల్యేలు తనకు మద్దతు తెలిపారని, ఈసంఖ్య 46 - 48కి చేరుకోవచ్చని చంపాయ్ పేర్కొన్నారు. తమ కూటమి బలంగా ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. బలపరీక్ష కోసం తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు సంకీర్ణ కూటమి సిద్ధమైంది.
కొంతమంది ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించేందుకు సిద్ధమైంది. ఈడి అరెస్టును సవాలు చేస్తూ హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 'మేం జోక్యం చేసుకోలేం' అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టుకు వెళ్లాల్సిందిగా సూచించింది. కాగా, రాంచీలోని పిఎంఎల్ఎ కోర్టు ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.