02-02-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా, విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీయాలని ఏపీసిసి చీఫ్ వైఎస్ షర్మిల సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని కోరారు. ఈ మేరకు ఢిల్లీలోని సిపిఎం కేంద్ర కార్యాలయంలో ఏచూరీని కలిసిన ఆమె వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ నాయకులు కెవిపి రామచంద్రరావు, తులసీరెడ్డి, తదితర నేతలు పాల్గొన్నారు. ప్రత్యేకహోదా, విభజన హామీల గురించి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కూడా ఆమె కలిశారు.
ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఢిల్లీలో ధర్నాకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా షర్మిల ధర్నా కోసం ఏపీ భవన్లో ఏపీ కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేపట్టారు. అయితే ఆ ఏర్పాట్లను ఏపీ భవన్ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. అనుమతి లేకుండా ధర్నా చేయడం కుదరదని వెల్లడించారు. దీంతో అధికారులతో ఏపీ కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. నేటి మధ్యాహ్నం 2 గంటలకు ఏపీ భవన్ వద్ద ధర్నా చేయాలని షర్మిల నిర్ణయించారు. షర్మిలతో పాటు ఏపీ కాంగ్రెస్ నేతలు, శ్రేణులు ధర్నాలో పాల్గొననున్నారు.
అయితే ఏపీ భవన్ సిబ్బంది తీరుతో షర్మిల ధర్నాపై ఉత్కంఠ నెలకొంది. కాగా.. ఏపీకి స్పెషల్ స్టేషన్ కోరుతూ ఢిల్లీ గడ్డ మీద ధర్నాకు షర్మిల పూనుకున్నారు. పలు పార్టీల నేతలను కలిసి ప్రత్యేక హోదాకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. శుక్రవారం ఉదయం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ తో భేటీ అయ్యారు. అనంతరం ఉదయం 10.30 గంటలకు డీఎంకే ఎంపీ తిరుచి శివను.. మధ్యాహ్నం 12 గంటలకు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో షర్మిల సమావేశమయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం మద్దతు ఇవ్వాలని ఆయా నేతలను షర్మిల కోరారు.