ad1
ad1
Card image cap
Tags  

  03-02-2024       RJ

రాజకీయాల్లో రాణించిన నటులు అరుదు !

జాతీయం

సినీపరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చి.. అధికారం చేపట్టి, ప్రజల్లో ప్రభావం చూపిన వారు చాలా తక్కువ మందే ఉన్నారు. తమిళనాట ఎంజి రామచంద్రన్ ఇలా ప్రజల మనిషిగా నిలబడ్డారు. తరవాత జయలలిత కూడా అదేకోవలో ప్రజల్లో చిరస్థాయిగా నిలిచారు. చిత్రపరిశ్రమ నుంచే వచ్చిన కరుణానిధి కూడా తమిళ నాట ప్రభావం చూపారు. ఉమ్మడి ఆంధ్రపదేశ్ లో ఎన్టీ రామారావు కూడా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. తనకంటూ ఓ స్థానం ఏర్పరచుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి కూడా ప్రజాప్రస్థానం పెట్టి తరవాత దానిని కాంగ్రెస్ లో విలీనం చేశారు. కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు.

ఇప్పుడాయన తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా జనసేనతో ఎపిలో దూసుకుపోతున్నారు. అయితే ప్రజల్లో విపరీతమైన ప్రభావం చూపగలిగిన వారు చాలా తక్కువమందే ఉన్నారు. ప్రముఖ తమిళ నటుడు విజయ్ రాజకీయాల్లో ప్రవేశిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించడంతో మరోసారి రాజకీయ సినిమా రంగం సంబంధాల అంశం తెరపైకి వచ్చింది. రాజకీయ పార్టీ స్థాపించిన మొదటి నటుడు విజయ్ కాదని, అలాగే ఆయనే చివరి వాడు కాడని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును రాజకీయాల్లో అత్యంత రాణించిన నటుడుగా చెప్పుకోవాలి. ఎన్టీ రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించారు.

తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి రావడంతోపాటు వినూత్న సంస్కరణలను తీసుకొచ్చి చరిత్రలో చెరగని ముద్ర వేశారు. సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి రావడ మనేది కొత్తేమీ కాదు. ఎందుకంటే సినిమాలకు, రాజకీయాలకు మధ్య అవినాభావ సంబంధం ఉంది. భారతీయ చిత్ర పరిశ్రమలో అనేక మంది నటులు రాజకీయరంగ ప్రవేశం చేసి, ప్రజాసేవ చేశారు. ముఖ్యంగా దక్షిణాదిలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. వెండితెరను ఏలిన చాలామంది కథానాయకులు, తర్వాతి కాలంలో రాజకీయాల్లో నాయకు లుగా ఓ వెలుగు వెలిగారు. వారిలో కొందరు సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్తే, మరి కొందరు ఇతర పార్టీలలో చేరి రాణించారు.

మన దేశంలో అత్యధికంగా తమిళనాడు రాజకీయాల్లోనే సినీ తారల పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కొత్త పార్టీ ప్రకటించ డంతో మరోసారి ఈ అంశం చర్చకు వచ్చింది. అన్నాదొరై, ఏంజీఆర్, జయలలిత, కరుణానిధి, నుంచి కమల్ హాసన్, విజయ్ వరకూ.. రాజకీయాల్లోకి వచ్చిన తమిళ నటులు కొందరే తమ ప్రభావం చూపారు. కంజీవరం నటరాజన్ అన్నాదురై.. స్వతంత్ర భారత దేశంలో కొన్ని తమిళ సినిమాల్లో హీరోగా నటించడంతో పాటు స్టోరీ, స్క్రీన్ ప్లే రైటర్గా కూడా వర్క్ చేశారు. పెరియార్ ఇ.వి. రామస్వామికి అనుయాయిగా పేరున్న ఆయన, ద్రవిడ కళగం పార్టీలో ఉన్నత స్థానానికి ఎదిగారు.

ప్రత్యేక ద్రవిడ రాష్ట్ర ఉద్యమానికి, రాజకీయాలకు సినిమాలని వాడుకున్నారు. అయితే పెరియార్తో తలెత్తిన అభిప్రాయాభేదాల కారణంగా బయటకి వచ్చి, 1949లో 'ద్రవిడ మున్నేట్ర కళగం’ (డిఎంకె) పార్టీని స్థాపించారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా, తమిళనాడు రాష్ట్రానికి మొట్ట మొదటి ముఖ్యమంత్రిగా అన్నాదొరై చరిత్రకెక్కారు. నడిగర్ తిలకం' శివాజీ గణేశన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. డీఎంకే పార్టీలో చేరిన శివాజీ.. అప్పట్లో తిరుపతి ఆలయాన్ని సందర్శించడం పై విమర్శలు రావడంతో బయటకు వచ్చి, తమిళ నేషనల్ పార్టీలో చేరారు. ఇందిరాగాంధీ హయాంలో ఆయన రాజ్యసభ సభ్యునిగా చేశారు.

1988-1989 కాలంలో సొంతంగా తమిళగ మున్నేట్ర మున్నాని అనే రాజకీయ పార్టీని స్థాపించారు. తమిళ సినీ రాజకీయాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తి మరుదూర్ గోపాలన్ రామచంద్రన్. 1953 వరకు కాంగ్రెస్ లో ఉన్న ఎంజీఆర్, అన్నాదొరై స్ఫూర్తితో డీఎంకేలో చేరారు. అయితే కరుణానిధి డీఎంకే నాయకత్వ బాధ్యతలు చేపట్టి సీఎం అయిన తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఎంజీఆర్ను బహిష్కరించారు. ఆ తర్వాత అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం ఎఐడిఎంకె పార్టీని స్థాపించారు.

1977 - 1987 మధ్య కాలంలో రెండుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా చేసి, మరణించే వరకు ఆ పదవిలో ఉన్నారు. మరణానంతరం ఆయనకు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న లభించింది. ఎంజీఆర్ సతీమణి జానకి రామచంద్రన్ కొన్ని అనివార్య పరిస్థితుల్లో ఎంజిఆర్ మరణం తరవాత సిఎం అయ్యారు. తరవాత ఐఎడిఎంకె ప్రధాన కార్యదర్శిగా పురట్చి తలైవి జయలలిత తమిళ రాజకీయాల్లో పెను సంచలనమనే చెప్పాలి. అన్నాడీఎంకే కు ఏకైక నాయకురాలిగా ఎదిగారు.

1991 2016 మధ్య కాలంలో జయలలిత ఆరుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కొన్నేళ్ల పాటు సినీ అభిమానులను అలరించిన కెప్టెన్ విజయ్ కాంత్, 2005లో దేశీయ ముర్ఫోక్కు ద్రవిడ కజగం అనే పార్టీని స్థాపించారు. 2011 నుంచి 2016 వరకు ప్రతిపక్ష నేతగా కూడా పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తమిళ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు కానీ, తన పార్టీని అధికారం లోకి తీసుకురాలేకపోయారు. విజయకాంత్ గత డిసెంబర్ లో కన్నుమూశారు.

సీనియర్ నటుడు శరత్ కుమార్ సైతం రాజకీయాల్లో ప్రవేశించారు. 2007లో తమిళనాడులో ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి అనే సొంత పార్టీని స్థాపించాడు. రాజకీయవేత్త కె. కామరాజ్ విలువలను పాటిస్తామని ప్రకటించుకున్నాడు. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో అడుగుపెట్టారు. గత కొన్ని దశాబ్దాలుగా సినీ అభిమానులను అలరిస్తున్న విశ్వ నటుడు కమల్ హాసన్.. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నించి విఫలం అయ్యారు. సీనియర్ నటి ఖుష్బు గత 14 ఏళ్లుగా తమిళనాడు రాజకీయాల్లో ఉన్నారు. 2010లో డీఎంకేలో పార్టీలో చేరి, నాలుగేళ్లలోనే కాంగ్రెస్ లోకి వచ్చి చేరారు.

ఆ తర్వాత 2020లో బీజేపీలో చేరి, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఉన్నారు. మరో సీనియర్ నటి గౌతమి సైతం పాలిటిక్స్ లోకి వచ్చారు. 1997 నుంచి భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు. దివంగత కరుణానిధి మనవడు, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ కూడా రాజకీయాల్లో ఉన్నారు. గత ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసి డీఎంకే పార్టీ భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు.

ఎంఎస్ఏగా గెలిచి తమిళనాడు శాసనసనలో అడుగుపెట్టారు. కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన దళపతి విజయ్ కూడా ఇప్పుడు పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా ప్రచారంలో ఉన్న వార్తలను నిజం చేస్తూ, ఫిబ్రవరి 2న 'తమిళగ వెట్రి కళగం' అనే పేరుతో సొంత రాజకీయ పార్టీని ప్రకటించారు. ఇకపోతే రాధా రవి, సీమాన్, టి. రాజేందర్, తంబి రామస్వామి, కరుణాస్, ఎంఆర్ కృష్ణన్ వంటి పలువురు సినీ ప్రముఖులు కూడా రాజకీయాలలో ఉన్నారు. సూవర్ స్టార్ రజనీకాంత్ కూడా పాలిటిక్స్ లోకి రావాలని భావించారు. అయితే తన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.

06, Jul 2024

సూరత్‌లో కుప్పకూలిన భవనం.. 15మందికి తీవ్ర గాయాలు

05, Jul 2024

ఢిల్లీలో బిజీబిజీగా సిఎం చంద్రబాబు.. పలువురు కేంద్రమంత్రులతో భేటీ

04, Jul 2024

రాష్ట్రానికి ఆర్థిక సాయం చేసి ఆదుకోండి

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP