03-02-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: 'భారతరత్న' పురస్కారం వరించడంపై మాజీ ఉప ప్రధాని, రాజనీతిజ్ఞుడు, బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ తొలిసారి స్పందించారు. అత్యంత వినమ్రత, కృతజ్ఞతతో ప్రదానం చేసిన 'భారతరత్న’ని తాను గర్వంగా అంగీకరిస్తున్నానని అద్వానీ అన్నారు. ఇది ఒక వ్యక్తిగా తనకు దక్కిన గౌరవం మాత్రమే కాదని, జీవితాంతం శక్తి మేరకు సేవ చేయడానికి తాను అవలంబించిన ఆదర్శాలు, సూత్రాలకు కూడా దక్కిన గౌరవంగా భావిస్తున్నానని వ్యాఖ్యానించారు.
'నేను 14 సంవత్సరాల వయస్సు లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వాలంటీర్ గా చేరిన నాటి నుంచి జీవితంలో నాకు అప్పగించిన ప్రతి పనినీ నాకు ఇష్టమైన దేశం కోసం అంకితభావంతో, నిస్వార్థంగా సేవ చేశాను. 'ఇదం న మమ్' (ఈ జీవితం నాది కాదు. నా జీవితం నా దేశం కోసం) నా జీవితాన్ని ప్రేరేపించింది'. 'భారత రత్న దక్కిన సందర్భంగా నేను సన్నిహితంగా పనిచేసిన ఇద్దరు వ్యక్తులు - పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్పేయిలను కృతజ్ఞతతో స్మరించుకుంటున్నాను.
ప్రజాజీవితంలో, నా ప్రయాణంలో కలిసి పనిచేసిన లక్షలాది మంది నా పార్టీ కార్యకర్తలు, స్వయంసేవకులు, ఇతరులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా కుటుంబ సభ్యులందరికీ, ముఖ్యంగా నా ప్రియమైన భార్య కమలకు ధన్యవాదాలు. వీరంతా జీవితంలో నాకు అండదండగా నిలిచారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఈ పురస్కారాన్ని అందించినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. మన దేశం గొప్పతనం కీర్తి శిఖరాగ్రానికి పురోగమిస్తోంది' అంటూ ఎల్ కే అద్వానీ ప్రకటన విడుదల చేశారు.