09-05-2024 RJ
జాతీయం
న్యూఢల్లీి, మే 9: దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరగబోయే ఈ ఎన్నికల్లో అధికార ఎన్‌డిఎ, కాంగ్రెస్ నేతృత్వంలోని ’ఇండియా’ కూటమి హోరాహోరీగా పోరాడుతున్నాయి. గెలుపు తమదంటే తమదని రెండు వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. అందుకు తగ్గట్లుగానే ఎండలను సైతం లెక్కచేయకుండా ప్రచారం జోరు సాగిస్తున్నాయి. అయితే ప్రజల్లో మాత్రం ఎన్నికల పట్ల నిరాసక్తత కనిపిస్తోంది. ఎవరికి ఓటేస్తే ఏమిటన్న భావన వస్తోంది. గత మూడు పర్యాయాలు జరిగిన పోలింగ్ సరళి చూస్తే ఓటింగ్ శాతం తగ్గిందని చెప్పవచ్చు. తగ్గిన ఓటింగ్ అంటే ఓటర్లలో ఉదాసీనత కనిపిస్తున్నదని, ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని కాంగ్రెస్ చెబుతుండగా ఎండల కారణంగానే ఓటింగ్ శాతం తగ్గింది తప్ప మరొక కారణం కాదని ఎన్‌డిఎ వర్గాలు చెబుతున్నాయి.
ఓటింగ్‌లో ఎందరు పాల్గొన్నా అదంతా తమకు అనుకూల ఓటని ఎన్‌డిఎ వర్గాలు చెబుతున్నాయి. 1952 నుంచి ఎన్నికల ఓట్ల శాతం, వివిధ పార్టీల గెలుపోటములను విశ్లేషిస్తే తక్కువ లేదా ఎక్కువ ఓట్లు పడితే అధికార లేదా విపక్షానికి విజయం తథ్యమనే విధంగా ఫలితాలు కనిపించడం లేదు. ఎన్నికల సెఫాలజిస్టులు మాత్రం తగ్గిన ఓటింగ్ శాతం అధికార పార్టీలకు వ్యతిరేకంగా మారే అవకాశాలే ఎక్కువని చెబుతున్నారు. దీనితో ప్రధానంగా పోటీ పడే రెండు ప్రధాన కూటముల్లో తక్కువ ఓటింగ్ భయాం దోళనలు నెలకొన్నాయి. అయినా రెండు కూటములు తమదే విజయమంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. దీనిపై వాదోపవాదాలు ఎలా వున్నా 50 డిగ్రీలకు పైగా వాతావరణం పెరిగితే ప్రజలు బయటికి వచ్చి క్యూలో నిలబడే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
ప్రస్తుతం ఓటింగ్ సమయం ఉదయం 7 గం. నుంచి సాయంత్రం 5 గం. దాకా ఉంది. ఉదయం 8 దాటితే ఎండలు ప్రజలను వణికిస్తున్నాయి. దీనికి తోడు వడగాడ్పులు అనేక మంది ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. మరోవైపు కరంటు కోతలు ఎన్నికల పక్రియకు ఆటంకం కల్పించే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఎన్నికలు జరిపి ఇప్పుడు ఓటింగ్ శాతం తగ్గిందనో, పెరిగిందనో చర్చించడం సరైనది కాదని రాజకీయ పండితులు అంటున్నారు. తెలంగాణలో ఎన్నికల సంఘం కాస్త జాగ్రత్త పడి పోలింగ్ సమయాన్ని 6 గంటల దాకా పొడిగించమని అడగడం, కేంద్ర ఎన్నికల సంఘం అంగీకరించడం జరిగింది. నిజానికి దేశవ్యాప్తంగా సాయంత్రి 7 గంటల వరకు ఓటింగ్ పొడిగిస్తేనే మంచిది. ఇకపోతే ఓటింగ్ శాతం తగ్గడానికి మండే ఎండలే కారణమని ఎన్నికల సంఘం వర్గాలు కూడా చెబుతున్నాయి. మొదటి రెండు దశల ఎన్నికల్లో ఎండలు 44 డిగ్రీల ఫారెన్ హీట్‌కు పరిమితమైతే మే నెలలో ఇంకా ఎండలు విజృంభించే అవకాశముంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఎండలు మే నెలలో 50 డిగ్రీలకు చేరినా ఆశ్చర్యం లేదని చెబుతున్నది. మండే ఎండలు, వీచే వడగాడ్పులు ప్రజలను ఇంటికే నిర్బంధం చేస్తున్నాయి. అలాంటి పరిస్థితిలో మునుముందు జరుగబోయే ఎన్నికల్లో ఓటింగ్ శాతం ఇంకా పడిపోయే అవకాశాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తగ్గిన ఓటింగ్ శాతం ఎవరికి లాభిస్తుందనేది తీవ్ర చర్చనీయాంశ మైంది.
దీనిపై గతంలో ఎన్నికల ఫలితాలు, సెఫాలజిస్టుల అంచనాలపై చర్చలు సాగుతున్నాయి. అయితే ఖచ్చితంగా ఓటింగ్ తక్కువైతే, ఎక్కువైతే అధికార పక్షానికి, విపక్షానికి లాభం జరుగుతుందనే శాస్త్రీయ అంచనాలు అయితే లేవు. ఎవరికి అనుకూలంగా వారు ఓటర్ టర్నవుట్‌ను మలుచుకుని జోస్యాలు చెబుతున్నారు.దేశంలో ఇప్పటిదాకా మూడు దఫాలుగా జరిగిన సార్వత్రిక లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం గతంతో పోలిస్తే తక్కువగా నమోదు కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. 2019 ఎన్నికలతో పోలిస్తే ముగిసిన 189 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల శాతం 3 నుంచి 4 శాతం దాకా తగ్గింది. తొలి విడతలో 101 నియోజక వర్గాలకు పోలింగ్ జరిగితే ప్రస్తుత ఎన్నికల్లో 66.14 శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2019లో ఇవే నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో 70 శాతం దాకా ఓటర్లు ఓట్లు వేశారు. రెండో దశలో కూడా ఇదే ఓటింగ్ తీరు కనిపించింది. ఇటీవల ముగిసిన రెండో దశలో 88 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే ప్రస్తుతం 66.71 శాతం ఓటర్లు ఓట్లు వేస్తే గడిచిన ఎన్నికల్లో ఓటర్లు ఇక్కడ 70 శాతం దాకా ఓట్లు వేశారు. మొత్తం 2019తో ప్రస్తుత పోలింగ్ శాతాన్ని పోలిస్తే 3.5 నుంచి 4 దాకా పోలింగ్ శాతం పడిపోయింది.
దీనితో దేశవ్యాప్తంగా తగ్గిన ఓటింగ్ శాతం ఎవరికి మోదం, ఎవరికి ఖేదం అనే విషయమై పార్టీల్లో, పరిశీలకుల్లో భిన్న రీతుల్లో చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి రెండు దశల ఎన్నికలే ముగిశాయి. ఇంకా ఐదు దశల్లో ఎన్నికలు జరగాలి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 70 శాతం పైగా ఓట్లు పడినప్పుడు బిజెపి 302 లోక్‌సభ సీట్లతో ఘన విజయం సాధించింది. ఈ దఫా ఓటింగ్ శాతం తగ్గడంతో ఓటర్ల నిరాసక్తత నెగటివ్ ఓటును సూచిస్తుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతుండగా, ఓటింగ్ తగ్గినా , పెరిగినా తమదే మూడోసారి విజయమని బిజెపి వర్గాలు చెబుతున్నాయి.