11-05-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, మే 11: లోక్ సభ ఎన్నికల్లో మహిళా ఓటర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఓట్ల శాతంలోనూ వారే అత్యధికంగా ఉన్నారు. అలాగే ఓట్లు వేయడంలోనూ మహిళలే ముందుంటున్నారు. ఇటీవల జరిగిన మూడు దఫాల్లోనూ మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటేశారు. అలాగే పురుషుల కన్నా ఓటింగ్ శాతం అతివలదే నమోదవుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో మహిళల ఓటింగ్ శాతం 0.16 ఎక్కువగా ఉంది. ఈ సారి అది మరింత పెరిగేందుకు అవకాశం ఉంది. అందుకోసం ప్రధాన రాజకీయ పార్టీలు మహిళల కోసం వరాలు కురిపిస్తున్నాయి. పొదుపు సంఘాలకు రుణం అందజేస్తూ ఆకర్షిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కేంద్రంలో అధికారం చేపట్టే పార్టీకి మహిళ ఓటర్లు వెన్నెముకలా నిలుస్తున్నారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో పురుషుల ఓటింగ్ శాతం 67. 02 శాతం ఉంది. అదే మహిళల ఓటింగ్ 67.18 శాతంగా ఉంది. 0.16 శాతం అతివల ఓటింగ్ ఎక్కువగా ఉంది. నిజానికి ఓటింగ్ శాతం కాస్త ఎక్కువే.. అయినప్పటికీ దేశ రాజకీయ చరిత్రలో ఒక విప్లవాత్మక మార్పునకు నాంది పలికింది. ఆ ఒరవడిని కొనసాగిస్తే మహిళల ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతోంది. దాంతో ప్రభుత్వం ఏర్పడటంలో మహిళా శక్తి కీలకంగా మారనుంది.
2019లో కొత్త మహిళా ఓటర్ల సంఖ్య 7.5 శాతం పెరిగింది. 438 మిలియన్ ఓటర్ల నుంచి 471 మిలియన్ల వరకు చేరింది. పురుష (ఓ।ని) ఓటర్ల కన్నా ఐదు శాతం ఎక్కువగా నమోదైంది. ఇందులో 8.5 మిలియన్ల మంది కొత్తగా ఓటు హక్కు పొందారు. అలాగే ప్రతి వెయ్యి మందు పురుష ఓటర్లకు మహిళల సంఖ్య కూడా పెరిగింది. 926 మహిళల నుంచి 948 వరకు చేరింది.
ఇలా దేశంలో మహిళా ఓటర్ల సంఖ్య పెరగడం నిశ్శబ్ద విప్లవంగా విశ్లేషకులు పరిగణిస్తున్నారు. 2014, 2019లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడేందుకు మహిళా ఓటర్లు ముఖ్య పాత్ర పోషించారు. ఈ విషయాన్ని యాక్సిస్ మై ఇండియా సర్వే సంస్థ తెలిపింది. 2019లో బీజేపీకి 46 శాతం మహిళలు ఓటు వేశారు. అదే పురుషుల ఓటు శాతం 44 శాతంగా ఉంది. అలా మోదీ ప్రభుత్వం మరోసారి ఏర్పడేందుకు మహిళలు వెన్నెముకగా నిలిచారని చెప్పొచ్చు.